ఆకాశంలో నేడు అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. రాత్రి సమయంలో గురు, శని గ్రహాలు అత్యంత దగ్గరగా రానున్నాయి. భూమిపై నుంచే చూసేవారికి ఒకే నక్షత్రంలా వెలుగులు విరజిమ్ముతూ కనిపించనున్నాయి. దాదాపు 400 ఏళ్ల క్రితం ఇలాంటి ఘట్టమే చోటు చేసుకోగా.. మళ్లీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. చివరిసారిగా ఇవి 1623 సంవత్సరంలో ఇంత దగ్గరగా వచ్చాయి.
ఇండియాలో ఈ అద్భుతాన్ని ఎలాంటి పరికరాల అవసరం లేకుండానే.. మాములు కళ్లతో చూడవచ్చు. సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 నిమిషాల ఈ అద్భుతం కనిపిస్తుంది. నైరుతి, పశ్చిమ దిక్కుల్లో ఆవిష్కృతమవుతుంది. గురు గ్రహం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తే.. దానికి ఎడమ భాగంలో శని గ్రహం కనిపిస్తుంది.
కాగా, రెండు గ్రహాలు అత్యంత సమీపానికి వచ్చినట్లు కనిపించినప్పటికీ.. వాటి మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుందని శాస్త్రవేతల్లు చెబుతున్నారు. 2080 మార్చి 15న మళ్లీ ఈ గ్రహాలు చేరువగా కనిపిస్తాయని అంటున్నారు.