పీసీసీ మార్పుపై వార్తలు వచ్చినప్పుడల్లా.. రేసులో తాను ఉన్నానంటూ ముందుకొచ్చే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డికి ఈసారి కూడా నిరాశే ఎదురయ్యేలా ఉంది. గతంలో ఆయనకు పీసీసీ దక్కకపోవడానికి అనేక కారణాలున్నా ఈసారి మాత్రం స్వయంకృతారాధమే ఆ పదవికి దూరం చేసేలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి తర్వాత.. కాంగ్రెస్ నాయకత్వ మార్పు తప్పదు అని గట్టి సంకేతాలు వచ్చాయి. ఇప్పుడేమో ఏకంగా రేవంత్ రెడ్డి పేరే దాదాపుగా ఖరారైందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఈ వార్త విన్న కోమటిరెడ్డి అభిమానులు.. రేవంత్ రెడ్డిపై కోపాన్నో, అధిష్టానంపై ఆగ్రహాన్నో ప్రదర్శిస్తారని అనుకుంటే.. దానికి విరుద్ధంగా కోమటిరెడ్డిపైనే తమ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికలతో అధిష్టానం దృష్టిలో పడే అవకాశం ఉన్నా… కోమటిరెడ్డి దాన్ని క్యాష్ చేసుకోకుండా లైట్ తీసుకున్నారని ఆయన అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోనే కాక.. తెలంగాణవ్యాప్తంగా తన మాట వినే నాయకులు ఉన్నారని చెప్పుకునే ఆయన.. గ్రేటర్ ఎన్నికల్లో బల ప్రదర్శన చేయాల్సింది అని అభిప్రాయపడుతున్నారు. అవన్నీ చేయకుండా పీసీసీ మార్పు అనగానే.. తనకే ఇవ్వాలని తెరపైకి రావడం లాభం చేకూర్చకపోగా.. పదవి కోసమే అయితేనే ముందుకొస్తారా అన్న అపవాదును కలిగిస్తోందని వాపోతున్నారు. మరోవైపు తనకు పీసీసీ ఇవ్వకుంటే పార్టీ మారే సంకేతాలను పంపడం మైనస్‌గా మారుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. పీసీసీ చీఫ్ అయ్యే అర్హతలన్నీ ఉన్నా.. పరిస్థితులకు తగ్గట్టుగా తమ లీడర్ నడుచుకోకపోవడమే ఆ సీటుకు దూరం చేస్తోందని వారు పెదవి విరుస్తున్నారు.