గ్రేటర్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రశంసలకంంటే.. ప్రశ్నల వర్షమే ఎక్కువైంది. నగర ప్రజల కోసం ఇన్నేసి ఉచితాలు అందించి, ఇతర కార్యక్రమాలు చేపట్టే చేసే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ఇన్నాళ్లు ఎందుకు వాటిని అమలు చేయలేదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా బల్దియాకు ఉండే అధికారాలు పరిమితమేనని.. ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం వారిలో మరింత అసంతృప్తిని రాజేస్తోంది. అంటే ఎన్నికల కోసం ఈ పథకాలను వాయిదా వేస్తూ వచ్చారా లేక.. ఎన్నికల్లో గెలిస్తే తప్ప అమలు చేయొద్దని నిర్ణయం తీసుకున్నారా అని జనం ప్రశ్నిస్తున్నారు.
విపక్షాలు కాబట్టి అధికారం కోసం ఎన్ని ఫేక్ ప్రామిస్‌లైనా చేయొచ్చు. సాధ్యాసాధ్యాలపై అవగాహన లేకపోయినా ఓటర్లను ఏదో మభ్యపెడుతున్నాయని అనుకోవచ్చు. కానీ అధికారంలో ఉన్న పార్టీ ఇలా ఎన్నికల కోసం ఇన్ని కార్యక్రమాలు, పథకాలను పెండింగ్‌లో పెట్టి.. ఎన్నికల తాయిలంగా ప్రకటించడమేంటని నిలదీస్తున్నారు. గ్రేటర్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే పని చేయాల్సి ఉంటుంది కాబట్టి.. టీఆర్ఎస్ గెలిచినా, ఓడినా మేనిఫెస్టోలోని అంశాలను నెరవేర్చాల్సిందేనని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.