గ్రేటర్ ఎన్నికల్లో ఎత్తులు, పొత్తులు, మద్దతు వంటి సమీకరణాలపై పార్టీల్లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఎక్కడెక్కడ, ఎవరెవరు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారనే లెక్క తేలింది. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 1122 మంది బరిలో నిలుచున్నారు. అత్యధికంగా టీఆర్‌ఎస్ ఒక్కటే 150డివిజన్లలో అభ్యర్థులను పోటీకి నిలిపింది. ఆతర్వాత 149 డివిజన్లలో బీజేపీ, 146 చోట్ల కాంగ్రెస్ క్యాండిడేట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ తర్వాత టీడీపీ 106, ఎంఐఎం 51, సీపీఐ ,17 సీపీఎం 12 స్థానాల్లో బరిలో నిలిచాయి. ఇక గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 76, స్వతంత్రులుగా 415 తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
గ్రేటర్ పీఠంపై కన్నేసిన బీజేపీ నవాబ్‌సాబ్ కుంట డివిజన్‌లో మాత్రమే పోటీ చేయట్లేదు. వాస్తవానికి ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ, సరైన పత్రాలు సమర్పించలేదన్న కారణంతో నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే తలాబ్‌చంచలం, బార్కస్, గోల్కొండ, టోలీచౌకీల్లో కాంగ్రెస్ నుంచి ఎవరూ పోటీలో లేరు.
నామినేషన్ల విత్ డ్రా తర్వాత ఒక్కో వార్డులో సగటున ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.జంగమ్మెట్‌లో అత్యధికంగా 20మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అత్యల్పంగా జీడిమెట్ల, టోలీచౌకీ, నవాబ్ సాహెబ్‌కుంట, బార్కస్, ఉప్పల్ డివిజన్లలో త్రిముఖ పోటీ నెలకొంది.