గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. 350 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలును ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ప్రయాణికులతో కూడిన రైలు ఏథెన్స్ నుంచి థెసాలోన్కి వెళ్తోంది. తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలు దాన్ని ఢీ కొట్టింది. దీంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో మూడు బోగీల్లో మంటలు చెల రేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో నిండిపోయింది. ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు.
థెస్సాలీ ప్రాంతం గవర్నర్ మాట్లాడుతూ…. రెండు రైళ్లు బలంగా ఢీ కొన్నాయన్నారు. మొదటి నాలుగు బోగీలు పట్టాలు తప్పాయన్నారు. వాటిలో మొదటి రెండు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. ఘటనా స్థలంలో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయన్నారు.
ఇప్పటి వరకు 250 మందిని కాపాడినట్టు తెలిపారు. ముందు బోగీల్లో 32 మంది సజీవదహనమయ్యారు. మరికొంతమందిని సహాయక సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఘటనా ప్రాంతంలో పూర్తిగా పొగ ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందిగా మారుతోందని అధికారులు తెలిపారు. క్రేన్స్ తీసుకు వస్తున్నామని, ఆపరేషన్ త్వరగా పూర్తి చేస్తామని చెబుతున్నారు.