పర్యావరణ పరిరక్షలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేప్టటిన వివిధ కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 2015 నుంచి 2021 సంవత్సరాల మధ్య పచ్చదనం శాతం 7.70 శాతం పెరిగినట్లు IFSR ప్రకటించిందన్నారు.
పచ్చదనం పెరగడం పై కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని తెలిపారు. శాసన సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా హరితహార కార్యక్రమం, పచ్చదనం పెంపుకు తీసుకుంటన్న చర్యలు, తదితర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నామన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల లోపల, వెలుపల పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలని నిర్ణయిం చామన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో 19.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, వచ్చే ఏడాదిలో 20.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని వెల్లడించారు.
మొక్కల పెంపక కార్యక్రమాలు చేపట్టడానికి గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీలకు బడ్జెట్ లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ గా కేటాయించామన్నారు. మొక్కల పెంపకం సక్రమంగా పర్యవేక్షణ జరిగేలా చూడడానికి జియో ట్యాగింగ్ ఆఫ్ ప్లాంటేషన్స్ ను చేపట్టామని తెలిపారు.