హైదరాబాద్ లో భారీ విధ్వంసానికి పాకిస్తాన్ లో పెద్ద ప్రణాళికే నడిచింది. పాక్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు చేరవేశారు.పేలుళ్లు జరిపేందుకు మూసారంబాగ్ కు చెందిన అబ్దుల్ జాహెద్ ను ఎంపిక చేశారు. అతనితో పాటు మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ పరూక్ కుట్ర పన్నినట్లు తేటతెల్లమైంది.
సిట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి.. రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు నిందితుల్లో అబ్దుల్ జాహెద్‌కు 22 ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయి. అతడి ప్రసంగాలతో మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ పరూక్ తీవ్రవాదంవైపు ఆకర్షితులయ్యారు.
బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లతో పాటు దసరా పండుగలను కూడా లక్ష్యంగా చేసుకొని విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమైన ముగ్గురు నిందితులను నగర సిట్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉగ్రవాదులు బాంబులకు బదులు శక్తిమంతమైన గ్రనేడ్‌లను నగరానికి డ్రోన్ల ద్వారా పంపుతున్నారని నిఘా వర్గాలు పసిగట్టాయి.
దాడులు కోసం ప్రత్యేకంగా ప్లాస్టిక్ గ్రనేడ్లు తయారు చేస్తున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ఇవి పేలగానే ప్లాస్టిక్ కవర్ విడిపోయి గ్రనేడ్ ముక్కలు మనుషుల శరీరాల్లోకి చొచ్చుకొని పోతే చికిత్స చేయడం కూడా చాలా కష్టం. అటువంటి వాటిని ఉగ్రవాదులు తయారు చేసి నగరానికి చేరవేస్తున్నారని నిఘా వర్గాలు కనిపెట్టాయి.
గత 26 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంటూ దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు చేయిస్తున్న ఘోరి కనుసన్నల్లోనే ఈ కుట్రకు రచన జరిగిందని తెలుస్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఉగ్రవాదులు పాకిస్తాన్ లో నివసిస్తూ..తమ రాష్ట్రాల్లో విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
వారిలో దాదాపు 20 మంది తెలంగాణకు చెందిన వారున్నట్లు సమాచారం. ఆరుగురు మాత్రం నగర యువతతో నిత్యం సంప్రదింపులు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.