మగాళ్ళు పెళ్ళి రోజు మర్చిపోవడం సర్వసాధారణమైన విషయం. చాలా మంది భార్యలు తమ భర్తల్ని పెళ్ళిరోజు ఎప్పుడని అడిగితే చెప్పలేరనే కాన్ఫిడెన్స్ తో ఇనిస్టెంట్ గొడవలకు పెళ్ళిరోజుని పావుగా వాడుకుంటారు. అయితే ఓ వ్యక్తి మగవాళ్ళ మీదున్న అపవాదుని మరింత పెద్దది చేసాడు.
బిహార్కు చెందిన ఓ యువకుడు మాత్రం, మద్యం మత్తులో తన పెళ్ళి మండపానికి వెళ్లడమే మర్చిపోయాడు! బిహార్ భాగల్పూర్ ప్రాంతానికి చెందిన మియాన్ అనే యువకుడికి సుల్తాన్‌గంజ్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లిని నిశ్చియించారు కుటుంబ సభ్యులు.
ఇందులో భాగంగా ముహుర్తాన్ని ఖరారు చేశారు పెద్దలు. ఈ క్రమంలో వరుడు కంటే ముందే వివాహ మండపానికి చేరుకున్న వధువు వరుడి రాకకోసం ఎదురు చూస్తూ ఉంది. ముహుర్త సమయం దాటినా పెళ్లికుమారుడు రాకపోయేసరికి వధువు కుటుంబీకులు ఆందోళన పడ్డారు.
కహల్‌గావ్‌లోని అంతిచాక్ ప్రాంతం నుంచి వరుడు ఊరేగింపు రావాల్సి ఉంది. కానీ అతడు ఊరేగింపుగా రాలేదు. పైగా ఉదయం రావాల్సిన అతడు మధ్యాహ్నం సమయంలో మద్యం సేవించి పెళ్లి మండపానికి వచ్చాడు.
అయితే మండపానికి ఘనంగా ఊరేగింపుగా వస్తాడని అనుకున్న అతిథులందరూ, ఏకంగా మద్యం సేవించి వచ్చిన పెళ్లి కొడుకుని చూసి అవాక్కయ్యారు. ఇది గమనించిన ఆ వధువు నాకీ పెళ్లి వద్దు బాబోయ్ అని తెగేసి చెప్పేసింది.
పెళ్లికి ముందే వరుడు తన బాధ్యతను మర్చిపోయాడని ఇక జీవితాంతం తనను ఎలా చూసుకుంటాడని ఆ యువతి ఆందోళన వ్యక్తం చేస్తూ..పెళ్లికి నిరాకరించింది. దీంతో పెళ్లిపీటల దాక వచ్చిన వివాహం అక్కడితో ఆగిపోయింది.
దీనిపై ఆందోళనకు దిగిన వధువు కుటుంబీకులు వరుడితో వచ్చిన బంధువులను, కుటుంబ సభ్యులను బంధించారు. పెళ్లి నిర్వహణ కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా వరుడి బంధువులను డిమాండ్ చేశారు.
ఇరు కుటుంబాలు ఈ విషయంపై గ్రామస్థుల సమక్షంలో పంచాయతీ పెట్టాయి. ఇద్దరి తరఫు వాదనలు విన్న గ్రామపెద్దలు వరుడితో పెళ్లి ఏర్పాట్లకైన మొత్తం డబ్బును వధువు కుటుంబానికి ఇప్పించారు.దీంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఇటీవల బిహార్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుండడం గమనార్హం.