పెళ్లి కోసం ఓ వ్యక్తి ఏకంగా 28 కిలోమీటర్లు నడిచి మరి వధువు ఇంటికి చేరుకున్నాడు. ఇదేదో దేవుని మొక్కో, సంప్రదాయామో కాదు..సమ్మె ఎఫెక్ట్. ఒడిశాలో డ్రైవర్లు సమ్మె చేయడంతో ఓ పెళ్లి కొడుకు ఏకంగా 9 గంటల పాటు నడిచాడు. సాయంత్రం 6 గంటలకు నడక ప్రారంభించి వేకువజామున 3 గంటలకు పెళ్లి కూతురు ఇంటికి చేరుకున్నాడు.
ఈ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో చోటు చేసుకుంది. కళ్యాణ్ సింగ్ పూర్ బ్లాక్ లోని సునాఖండి పంచాయతీకి చెందిన రమేష్ ప్రస్కా అనే యువకుడికి దిబలపాడుకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం వధువు ఇంటి వద్ద వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి వెళ్లడానికి యువకుడు నాలుగు వాహనాలను కూడా ఏర్పాటు చేశాడు.
అయితే రాష్ట్రంలో బుధవారం నుంచి డ్రైవర్లు సమ్మె చేస్తుడడంతో చేసేదేమి లేక వరుడు కుటుంబ సభ్యులందరితో కలిసి కాలినడకన బయల్దేరారు. గురువారం సాయంత్రం నడక మొదలు పెట్టి శుక్రవారం తెల్లవారుజాముకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం పెళ్లి జరిగిన తరువాత పెళ్లి బృందమంతా పెళ్లి కూతురు ఇంటి వద్దే బస చేశారు.
శుక్రవారం సాయంత్రానికి డ్రైవర్ల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో డ్రైవర్లు సమ్మె విరమించారు. దీంతో పెళ్లి వారంతా వారి గ్రామానికి చేరుకోవడానికి మార్గం సుగమం అయ్యింది