నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కొట్లాడితే తెలంగాణ సాధ్యమైంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. కానీ, మొదటి నుండి ఏదో ఒక సమస్యతో ఈ నోటిఫికేషన్ వార్తల్లో నిలుస్తోంది. డీఎస్పీ అర్హత వయస్సు పెంచటం కోసం, హైట్ తగ్గించటం కోసం అభ్యర్థులు రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సి వచ్చింది. చివరికి అర్హత వయస్సు పెంచటం, హైట్ తగ్గించటం జరిగింది.
నోటిఫికేషన్ లో 1992లోనే ఇందిరా సహాని కేసు, రాజేష్ కుమార్ దరియా కేసులో రద్దు చేసిన వెర్టికల్ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఇండెంట్లు ఇవ్వటం జరిగింది. దీనివల్ల పురుష అభ్యర్థులు నష్టపోతున్నారు అని హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయాలి అని తీర్పు ఇచ్చింది. ఇక ప్రిలిమినరీ పరీక్ష విషయానికి వస్తే ఎన్నో కఠినమైన నిబంధనల మధ్య నిర్వహించారు. ప్రశ్నాపత్రం చూస్తే అభ్యర్థుల మీద పగ పట్టినట్టు చాలా సుధీర్గమైన ప్రశ్నలు 2,80,000 మందిలో ఒక్కరు కూడా పూర్తి పేపర్ ను చదివి సమాధానాలు రాయలేని పరిస్థితి. ఇక ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే ఎన్నడూ లేని విధంగా ABCD మాత్రమే కాకుండా కొన్నింటికి EFGH అనే కొత్త ఆప్షన్లు కూడా దర్శనమిచ్చాయి. ప్రశ్నల్లో అధిక శాతం స్టేట్మెంట్లు, జత పర్చటం ఎక్కువగా ఉన్నాయి. జతపరచటంలో కూడా 4కి బదులుగా 6 నుండి 8 ఆప్షన్లు ఇచ్చారు. పోనీ.. ఇంత చేసి టీఎస్పీఎస్సీ సాధించింది ఏముంది 7 ప్రశ్నలు తప్పు ఇచ్చింది. అందులో 5 ప్రశ్నలను తొలగించారు. 2 ప్రశ్నలకు ఏ ఆప్షన్ పెట్టినా మార్క్ ఇచ్చారు. అంటే.. 7 తప్పుడు ప్రశ్నల మూలాన అభ్యర్థులు ఆలోచించి వారి సమయాన్ని వృధా చేసుకున్నట్టేగా. ఈ పరీక్షలో అభ్యర్థులకు సమయం సరిపోకపోవటం వలన విషయ పరిజ్ఞానం, సామర్థ్యం కంటే అదృష్టం అనేది ముఖ్య భూమిక పోషించింది.
ఇక పరీక్ష నిర్వహణ విషయానికి వస్తే టీఎస్పీఎస్సీ ఆఫీస్ కి కూతవేటు దూరంలో ఉన్న 3 పరీక్షా కేంద్రాలలో అరగంట లేట్, ఒక కేంద్రంలో అయితే ఏకంగా మధ్యాహ్నం నిర్వహించారు. ఈ విషయం మొదట్లో కమిషన్ బయటకు చెప్పలేదు. తర్వాత బయటపడింది. ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తే కమిషన్ వారు అక్కడ జరిగిన అవాంతరాల మీద నివేదిక తెప్పించుకుంటాం, భాద్యులపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రిజల్ట్ ఇచ్చే లోపు పూర్తి నివేదిక బయట పెడుతాం అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఇప్పటికీ వివరాలు బయటకు రాలేదు.
రిజల్ట్స్ విషయానికి వస్తే ఇదిగో అదిగో అంటూ వరసగా 4 రోజులు పండుగ సెలవులు చూసుకొని అర్ధరాత్రి విడుదల చేశారు. ఆ రిజల్ట్స్ చూస్తే మల్టీ జోన్ పరంగా కట్ ఆఫ్ ఇవ్వలేవు. క్యాస్ట్ పరంగా కట్ ఆఫ్ ఇవ్వలేదు. పోస్టుల పరంగా కట్ ఆఫ్ ఇవ్వలేదు. పోస్టులకు ప్రత్యేక అర్హతలు ఉన్నాయి. వాటికి ఏ పద్దతిలో సెలెక్ట్ చేశారో తెలియదు. ఆలస్యంగా మధ్యాహ్నం పరీక్ష నిర్వహించిన కేంద్రాల్లో ఎంతమంది అర్హత సాధించారో వివరాలు బయటపెట్టలేదు. వెర్టికల్ నుండి హారిజాంటల్ పద్దతిలో మార్చినప్పుడు వచ్చిన కొత్త రోస్టర్ ని బయట పెట్టలేదు. మహిళా అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఇచ్చారో వివరాలు తెలియదు. ఒకే మల్టీజోన్ ఒకే సామజిక వర్గం అయినప్పటికీ తక్కువ మార్కులు వచ్చిన వారు సెలెక్ట్ అయ్యి ఎక్కువ మార్కులు వచ్చిన వారు కాకపోవటంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీలో 1:50 కి బదులుగా 1:100 మంది మెయిన్స్ కి సెలెక్ట్ చేసి అత్యధిక అభ్యర్థులకు మెయిన్స్ రాసుకునే అవకాశం కలిపిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రూప్-1 పేపర్ టఫ్ వచ్చింది అని 1:75 చొప్పున సెలెక్ట్ చేసిన సందర్భం ఉందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కుడా 1:100 చొప్పున మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీటితో పాటు అన్ని రాష్ట్రాలు గ్రూప్-1 సర్వీస్ నియామకంలో వారి యొక్క మాతృ భాషను ఆప్షనల్ పేపర్ గా పెట్టుకున్నాయి. ఏపీలో సైతం తెలుగు ఆప్షనల్ పేపర్ ఉంది. తెలుగు ఆప్షనల్ పేపర్ పెట్టకపోతే నార్త్ ఇండియన్ రాష్ట్రాల నుండి వచ్చి హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాలలో సెటిల్ అయిన స్థానికేతరులు మన ఉద్యోగాలు కొల్లగొట్టే అవకాశం ఉంది.. పై విషయాలు టీఎస్పీఎస్సీ , ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని తగు న్యాయం చేయాలని కోరుతున్నారు అభ్యర్థులు.
మరోవైపు టీఎస్పీఎస్సీ హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు పని చేయడం లేదు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలపై సందేహాల నివృత్తి కోసం మూడు నెంబర్లను(040- 22445566, 040-23542187, 040- 23542185)ఇవ్వగా అవి పని చేయడం లేదంటున్నారు అభ్యర్థులు. మూడు రోజులుగా ఫోన్ చేసినా లాభం లేదని చెబుతున్నారు. వెల్కమ్ చెప్పి కట్ అవుతోందని అంటున్నారు.