తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం కారణంగా కష్టపడి చదివిన నిరుద్యోగులకు కన్నీళ్లను మిగిల్చింది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించివారైతే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఎలాగైనా సర్కారు కొలువు కొట్టి కుటుంబానికి అండగా నిలబడాలని భావించే వారి వ్యతలు చెప్పుకోలేనివి. భద్రాచలానికి చెందిన భవానీది ఇదే పరిస్థితి. ఆమెకు మాటలు రావు.. వినబడదు కూడా. అయినా కష్టపడి చదవి గ్రూప్-1 పరీక్ష పాస్ అయింది. మెయిన్స్ కు అర్హత కూడా సాధించింది. తీరా గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ ప్రకటించడంతో వారి కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలంలోని శాంతి నగర్ కాలనీకి చెందిన మల్లయ్య, తిరుపతమ్మకు ఇద్దరు కుమార్తెలు. మల్లయ్య కూలి పనులు చేస్తుండగా.. తిరుపతమ్మ చుట్టుపక్కల ఇళ్లల్లో ఇంటి పనులు చేసి కాలం గడుపుతున్నారు. ఇద్దరు ఆడపిల్లల్లో చిన్న కుమార్తె భవాని చిన్ననాటి నుంచి దివ్యాంగురాలు. చెవులు వినకపోవడం వల్ల మాటలు సరిగా మాట్లాడలేదు.
అలాగే నానా బాధలు పడి చుట్టుపక్కల వారి సహాయంతో ఇద్దరు కుమార్తెలను తిరుపతమ్మ, మల్లయ్యలు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు రాయించారు. ప్రిలిమ్స్ పాస్ అయింది. దీంతో భవానీకి ఉద్యోగం వస్తుందని, వారి కష్టాలన్నీ తీరిపోతాయని ఆశతో ఎదురు చూశారు.
తీరా గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఉండడానికి కనీసం ఇల్లు సైతం లేదని.. మళ్లీ పరీక్ష రాసే స్థోమత కూడా తమకి లేదని ప్రభుత్వం లేదా దాతలెవరైనా స్పందించి తమను ఆదుకోవాలని తల్లి తిరుపతమ్మ, తండ్రి మల్లయ్యలు కోరుతున్నారు.