టీఎస్పీఎస్ పరీక్షా పేపర్ల లీక్ కలకలం రేపుతోంది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ పరీక్షకు చెందిన పేపర్ లీక్ కాగా.. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ కూడా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ కు కారణమైన టీఎస్ పీఎస్ ఉద్యోగి ప్రవీణ్ ను పోలీసులు విచారించగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తన సన్నిహితురాలు రేణుక కోసమే తాను పేపర్ లీక్ కు పాల్పడినట్లు నిందితుడు ప్రవీణ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
పోలీస్ ఇంటరాగేషన్ కొనసాగుతోంది. కాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష లీకైనట్లు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అశోక నగర్ లోని సెంట్రల్ లైబ్రరీ ఎదుట వారు ఆందోళనకు దిగారు. ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతోంటే పేపర్ లీక్ చేసి తమ జీవితాలతో ఆడుకుంటున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉద్యోగ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో జరగనున్న గ్రూప్ 2,గ్రూప్3, గ్రూప్4 తో పాటు మిగతా పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలని కోరుతున్నారు. పేపర్ లీక్ కు పాల్పడ్డ ప్రవీణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇలా ఉంటే పేపర్ లీక్ ఉదంతంలో పోలీసుల అదుపులో ఉన్న ప్రవీణ్ కు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష లో 150 మార్కులకు గానూ 103 మార్కులు వచ్చాయంటూ ఓ నిరుద్యోగి ట్విట్టర్ లో ప్రవీణ్ ఓఎమ్ఆర్ షీట్ ను పోస్టు చేశాడు. గంటల కొద్దీ చదివిన చాలా మంది అభ్యర్థులకు 100 మార్కులు సాధించడం కష్టంగా మారిందని, అలాంటిది ఉద్యోగం చేస్తూ ప్రవీణ్ 103 మార్కులు సాధించడమంటే నమ్మశక్యంగా లేదని, అతడు కచ్చితంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ ను లీక్ చేసి ఉంటాడని సోషల్ మీడియా వేదికగా నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.