దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ చూడనంతగా నెలవారీ వసూళ్లు ఆల్ టైం రికార్డును సాధించాయి. ఏప్రిల్ నెలకు గాను రూ.1,67,540 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది జీవితకాల గరిష్ఠమని తెలిపింది. ఇదే ఏడాది మార్చిలో వసూలైన రూ.1.42 లక్షల కోట్లు రెండో అత్యధికమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
మార్చితో పోల్చితే ఏప్రిల్ లో రూ.25వేల కోట్లు అధికంగా జీఎస్టీ రాబడి వచ్చిందని వివరించింది. ఇక గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ లో 20 శాతం మేర ఎక్కువ వసూళ్లు నమోదయ్యాయి. అంతే కాదు జీఎస్టీ వసూళ్లు 1.5 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. ఇక, ఏప్రిల్ నెలలో వసూలైన జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ రూ.33,159 కోట్లుగా, ఎస్‌జీఎస్టీ రూ.41,793 కోట్లుగా, ఐజీఎస్టీ రూ.871,939 కోట్లుగా, సెస్ రూ.10,649 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది.
ట్యాక్స్ చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులు సమర్పించేలా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలించాయని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ పేర్కొంది. కంప్లియెన్స్‌లు సరళీకరించడం, పన్ను ఎగొట్టే వారిపై కఠిన చర్యలు, మెరుగుపడిన ఆర్థిక కార్యకలాపాల వల్ల జీఎస్టీ వసూళ్లు పెరిగినట్టు కేంద్రం అభిప్రాయపడింది. ఇక, రాష్ట్రాలవారీగా చూస్తే ఈ ఏడాది ఏప్రిల్ లో అత్యధికంగా మహారాష్ట్రలో రూ.27,945 కోట్లు, గుజరాత్ లో రూ.11,264 కోట్లు జీఎస్టీ కింద వసూలైంది.
తెలంగాణలో రూ.4955 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో రూ.4067 కోట్లు జీఎస్టీ కింద వసూలైంది. గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 16 శాతం పెరగ్గా ఏపీలో 22 శాతం మేర వసూళ్లు పెరిగాయి.