దేశంలోని రాష్ట్రాలకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు అందించారు. జూన్ నెలకు గాను రాష్ట్రాలకు అందవలసిన జీ ఎస్టీ పరిహార బకాయిలనన్నింటినీ రూ. 16, 982 కోట్లతో సహా చెల్లించివేస్తామని ఆమె ప్రకటించారు. ఈ నిధులు కంపెన్సేషన్ ఫండ్ లో రెడీగా అందుబాటులో లేవని, కానీ కేంద్ర ప్రభుత్వమే వీటిని తన సొంత వనరులనుంచి విడుదల చేయనుందని చెప్పారు. ఈ నిధుల విడుదలతో 2017 నాటి జీ ఎస్టీ చట్టంలో నిర్దేశించినట్టు ఐదేళ్లకు గాను కంపెన్సేషన్ సెస్ బకాయిలను కేంద్రం క్లియర్ చేస్తుందన్నారు.
ఆమె అధ్యక్షతన శనివారం 49 వ జీ ఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇక కొన్ని ఉత్పత్తుల ధరలను తగ్గించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీటిపై జీ ఎస్టీ తగ్గనుంది. పెన్సిల్, షార్ప్ నర్స్, ట్రాకింగ్ డివైజ్ ల మీద జీ ఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించనున్నారు.
లూజ్ లిక్విడ్ జాగరీ (ద్రవ్య బెల్లం) పై పన్నును ఉపసంహరించామని, కానీ ప్యాకేజ్ చేసిన లేబుల్ చేసిన ద్రవ్య బెల్లం పై 5 శాతం జీఎస్టీ ఉంటుందన్నారు.
ఆలస్యంగా దాఖలు చేసిన వార్షిక జీ ఎస్టీ రిటర్నులపై పెనాల్టీని హేతుబద్దం చేయాలనీ నిర్ణయించామన్నారు. ఏడాదికి రూ. 2 కోట్ల టర్నోవర్ కలిగిన చిన్నపాటి పన్ను చెల్లింపుదారులకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. గుట్కా, పాన్ మసాలా అమ్మకందారులు పన్ను ఎగ్గొట్టకుండా చూస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.