గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ సీనియర్ నేత
బస్వాపూర్ రిజర్వాయర్ లో మిగిలిన నిర్వాసితులకు కూడా ఈ నెలాఖరులోగా నష్టపరిహారం చెల్లించాలి. లేకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం. నిర్వాసితులకు ప్రభుత్వం కొత్త భూముల విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలి. సాదా బైనామా భూములను కూడా వెంటనే క్రమబద్ధీకరించాలి. బీఎన్ తిమ్మాపూర్ గ్రామం, రెండు తండాల్లోని బస్వాపూర్ రిజర్వాయర్ భూముల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి మూడేళ్లు గడుస్తున్నా నిర్వాసితులందరికీ ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు. 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 4,250 ఎకరాలు సేకరించింది.
కన్సెంట్ అవార్డు కింద 2,950 ఎకరాలకు పరిహారం చెల్లించింది. ఎకరానికి దాదాపు రూ.14 లక్షలు ఇచ్చింది. బీఎన్ తిమ్మాపూర్ గ్రామంలో సుమారు 1,710 ఎకరాలు సేకరించగా 450 ఎకరాలకు మాత్రమే పరిహారం అందించింది. తిమ్మాపూర్, రెండు తండాల్లో కలిపి 1,300 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. మిగిలిన నిర్వాసితులకు జనరల్ అవార్డు కింద నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. మిగిలిన వారికి కూడా పాత పద్దతిలోనే పరిహారం చెల్లించాలని ఏడాది నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం కార్యాచరణ పూర్తి చేయలేదు.
నష్టపరిహారం చెల్లించేందుకు జిల్లా యంత్రాంగం పనులు పూర్తి చేసినా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిహారం చెల్లించలేదు. పునరావాసం, ఇతర పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం భూమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో ఎవరికీ తెలియదు.
రాష్ట్రాభివృద్ధి కోసం భూములను త్యాగం చేస్తున్న నిర్వాసితులను స్వాతంత్య్ర సమరయోధులుగా, నిజమైన దేశభక్తులుగా భావించాలి. కానీ ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోంది.