గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోర్బీలో ఉప్పు కంపెనీలో గోడ కూలి 12 మంది దుర్మరణం చెందారు. సుమారు 20 మంది వరకు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనావేస్తున్నారు.
ఘటన విషయం తెలుసుకుని స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. జేసీబీలను ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నారు. కంపెనీలో వర్కర్లు పనిచేస్తున్న సమయంలో హఠాత్తుగా గోడ కూలినట్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో 12 మంది మృతి చెందినట్టు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా ధ్రువీకరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించింది.