ఐపీఎల్ 2022 సీజన్ 15 చివరి అంకానికి చేరుకుంది.మెగా ఫైనల్లో తలపడేందుకు గుజరాత్ టైటాన్స్ ,రాజస్థాన్ రాయల్స్ సిద్ధమయ్యాయి. ఫైనల్ గెలిచి కప్పు అందుకునేందుకు రెండు జట్లు ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. టైటిల్ గెలుచుకుని ఆనందంతో పొంగిపోయే జట్టేది.. ఓడి రన్నరప్ గా నిలిచే జట్టేది.. అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. నేడు అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరగనున్నఫైనల్ కోసం ఇరుజట్లు తమ బలాబలాలను పరిశీలించుకుంటున్నాయి.
అయితే.. ఈ సీజన్ తో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ అదిరిపోయే ప్రదర్శనతో ఫైనల్ కు చేరింది.కొత్త జట్టు ఎలా ఆడుతుందో అన్నఅనుమానాలకు తెరదించుతూ..వరుస విజయాలతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.లీగ్ స్టేజ్ ను టాప్ ప్లేస్ తో ముగించి..తొలి క్వాలిఫైయర్ లో రాజస్థాన్ ను చిత్తు చేసింది. ఇప్పుడు టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది గుజరాత్.
మంచి బ్యాటింగ్ లైనప్ తో ఉన్న గుజరాత్ జట్టుకు శుబ్ మాన్ గిల్, వేడ్, మిల్లర్ లు కీలకంగా మారనున్నారు.వీరికి తోడు ఓపెనర్ గా శుబ్ మాన్ గిల్ తోపాటు..వృద్దిమాన్ సాహా ఈ సీజన్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ.. ఫైనల్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తిగా మారింది. వన్ డౌన్ లో వేడ్ బ్యాట్ కు పని చెప్తూ వస్తున్నాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ హార్దిక పాండ్యా, అయిదో స్థానంలో డేవిడ్ మిల్లర్ కీలకం కానున్నారు.
తర్వాత ఆల్ రౌండర్ల రూపంలో కనిపించకుండానే బాల్ ను చుక్కల్లోకి పంపించే సత్తా ఉన్నరాహుల్ తెవాటియా,రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఉండటంతో..బ్యాటింగ్ లైనప్ లో గుజరాత్ ఏడు వికెట్ల వరకు పటిష్టంగానే ఉంటోంది.ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్, పేస్ విభాగంలో మొహమ్మద్ షమీ, అల్జెరీ జోసెఫ్, యశ్ దయాల్ కీలకమని చెప్పొచ్చు.
ఇటు రాజస్థాన్ టీం విషయానికొస్తే.. ఇప్పటి వరకు అద్భుతమైన ఆట తీరుతో సంజూ శాంసన్ సేన ముందుకు దూసుకెళ్తుంది. లీగ్ దశలో అద్భుతంగా రాణించిన ఆర్ఆర్.. మొదటి క్వాలిఫయర్ లో విఫలమైనప్పటికీ.. రెండవ క్వాలిఫయర్ లో ఆర్సీబీని మట్టికరిపించి.. ఫైనల్ కు చేరుకుంది. అయితే.. ఓపెనర్లుగా బట్లర్, యశస్వీ జైస్వాల్ మంచి స్టార్టింగ్ స్టాండప్ ఇవ్వడంతో టీం మంచి పట్టు సంపాదిస్తూ వస్తోంది. యంగ్ బ్యాట్స్ మెన్ జైస్వాల్ అబ్బురపరిచే ఆటతో ఆడుతూ టీంకు వెన్నెముకలా మారాడు.
ఇక మరో ఓపెనర్ బట్లర్..ఈ సీజన్ టాప్ స్కోరర్ గా ఉండటమే కాకుండా.. మంచి ఫుట్ వర్క్ తో అదిరిపోయే షాట్స్ ఆడుతున్నాడు. ఇప్పటికే..ఈ సీజన్ లో నాలుగు సెంచరీలు చేసి టీంను ఫైనల్ వరకు లాక్కొచ్చిన బట్లర్.. చివరి ఘట్టంలో కీలకం కానున్నాడు. ఇక వన్ డౌన్ లో వస్తున్న కెప్టెన్ సంజూ శాంసన్.. ఓ వైపు తన బ్యాటింగ్ ను, మరోవైపు టీంను బ్యాలెన్స్ చేస్తూ అద్భుతమైన నాయకత్వ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సీజన్ లో కప్పు సాధించాలంటే సంజూ తప్పక మంచి నాక్ ఆడాల్సిందే.
రాజస్థాన్ కు మరో కీలక బ్యాట్స్ మెన్ దేవదత్ పడిక్కల్.. ఈ సీజన్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఫైనల్ లో ఓ మంచి నాక్ అందించాల్సిన అవసరం అయితే ఉందంటున్నారు ఆర్ఆర్ అభిమానులు.రాజస్థాన్ బౌలింగ్ లైనప్ లో ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్ కాయ్ ల రూపంలో మంచి బౌలర్లే ఉన్నప్పటికీ.. ఎక్స్ స్ట్రా బౌలర్ ను క్యారీ చేయడం మంచిదని అంటున్నారు.
Advertisements
అయితే.. ఈ సీజన్ లో గెలుపు, ఓటములు అనేది పూర్తిగా టాస్ పైనే ఆధారపడి ఉన్నాయి.ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటి వరకు ఎక్కువగా సేజింగ్ లో ఉన్న టీంలు విజయం సాధించడంతో గెలుపు ఎవరిది అనేది టాస్ నిర్ణయిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా.. ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఏదైనప్పటికీ.. సుమారు 200 పైన స్కోర్ చేస్తే.. ఛేజింగ్ లో వచ్చే టీంకు గట్టి పోటీ ఇవ్వొచ్చంటున్నారు. 2022 ఐపీఎల్ సీజన్ లో విజేత ఎవరనేది ఇంకొన్ని గంటల్లో తేలనుంది.