గుజరాత్‌లో గోద్రా అల్లర్లపై ప్రధాని మోడీని బాధ్యుడిగా చూపిస్తూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై గుజరాత్ అసెంబ్లీ ఓ తీర్మానం చేసింది. ఈ డాక్యుమెంటరీ విషయంలో బీబీసీపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానంలో అసెంబ్లీ కోరింది.
తీర్మానం సందర్బంగా గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ… బీబీసీ డాక్యుమెంటరీ కేవలం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రూపొందించింది కాదన్నారు. ఇది దేశంలోని మొత్తం 135 కోట్ల మంది పౌరులకు వ్యతిరేకంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోడీ తన జీవిత మంతా దేశ సేవకే అంకితం చేశారని ఆయన అన్నారు. దేశ వ్యతిరేక శక్తులకు మోడీ తగిన సమాధానం ఇచ్చారని చెప్పారు. ప్రపంచ వేదికపై భారత్‌ను అగ్ర స్థానంలో నిలబెట్టేందుకు ప్రధాని ఎంతో కృషి చేశారని ఆయన వెల్లడించారు.
2002 గుజరాత్ అల్లర్లలో అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న ప్రధాని మోడీ పాత్ర ఉందని బీబీసీ ఆరోపించింది. ఈ మేరకు డాక్యుమెంటరీని రూపొందించగా దానిపై పెద్ద దుమారం రేగింది. ఆ డాక్యుమెంటరీని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిష్పాక్షికత లేనిదని పేర్కొంది.