అజ్ఙానమో…తల కెక్కిన మతోన్మాదమో తెలియదు కానీ గుజరాత్ లోని ఓ కాలేజీలో జరిగిన సంఘటన మనం ఆధునిక భారతదేశంలో ఉన్నామా..? లేక మధ్య యుగాల్లో ఉన్నామా అనే అనుమానం కలిగిస్తోంది. గుజరాత్ లోని ఓ కాలేజ్ లో అమ్మాయిలు పీరియడ్స్ లో ఉన్నారేమోనని కాలేజీ సిబ్బంది చెక్ చేసిన సంఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. కాలేజ్ నిబంధనల ప్రకారం రుతుస్రావం జరిగే అమ్మాయిలు కాలేజ్ హాస్టల్లోకి ప్రవేశించకూడదు. వారి కోసం దూరంగా నిర్మించిన ప్రాంతంలోనే ఉండాలి. పవిత్రమైన కిచెన్ లోకి రావడానికి వీలు లేదు. అయితే హాస్టల్ పరిసరాల్లో వాడి పారేసిన శానిటరీ నాప్కిన్ కనిపించడంతో అనుమానం వచ్చిన కాలేజ్ సిబ్బంది 68 మంది విద్యార్ధినులను వాష్ రూమ్ లో వరుసగా నిలబెట్టి ఒక్కొక్కరిని డ్రెస్ విప్పి చెక్ చేశారు. ఈ సంఘటనపై స్పందించిన నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ కాలేజ్ కు దర్యాప్తు బృందాన్ని పంపింది.
ఇదంతా జరిగింది ఎక్కడో కాదు…ప్రధాన మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ బుజ్ లోని స్వామినారాయణ సంస్థకు చెందిన శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్ లో. స్వామినారాయణ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలున్నాయి. కొన్ని విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంఘటనపై విద్యార్ధులు తీవ్రంగా స్పందించారు. చాలా అసభ్యంగా, అవమానకరంగా ప్రవర్తించిన కాలేజ్ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.”మా కాలేజ్ ని మేము గౌరవిస్తాం…కానీ వాళ్లు చేసింది తప్పు..వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి…విషయం బయటకు తెలియజేయడానికి మీడియాను పిలవాలనుకున్నాం” అని ఓ విద్యార్ధిని చెప్పారు. తమ నిరసన విరమించుకోవాలని కాలేజ్ పాలకులు తమపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ” ప్రిన్సిపాల్, మరికొందరు కాలేజీ స్టాప్ మమ్మల్ని పిలిపించి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు…అంతా మంచిగానే ఉన్నట్టు లెటర్ రాయమని ఒత్తిడి తెస్తున్నారు…మాకు న్యాయం కావాలి..వారి అపాలజీ కాదు” అని మరో బాధిత స్టూడెంట్ కోరుతున్నారు.
కాలేజ్ లో చేరే ముందు స్టూడెంట్స్ కు ఇక్కడున్న నిబంధనల గురించి వివరించామని కాలేజ్ ట్రస్టీ ప్రవీణ్ పిండోరియ తెలిపారు. కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మీటింగ్ కు ఏర్పాట చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు కాలేజ్ డీన్ దర్శన్ డొలాకియా తెలిపారు. ”విషయం హాస్టల్ కు సంబంధించినది..ఇది కాలేజీకి గానీ యూనివర్సిటీకి గానీ సంబంధం లేదు..అంతా అమ్మాయిల అనుమతి తోనే జరిగింది…ఎవరూ బలవంతం చేయలేదు…వారిని ఎవరూ ముట్టుకోలేదు…విచారణ కమిటీ వేశాం, వాళ్లు చూసుకుంటారు” అని డొలాకియా సమాధానమిచ్చారు.