గుజరాత్ లోని గాంధీదామ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన భారత్ భాయ్ వెల్జీభాయ్ సోలంకీ అనే అభ్యర్థి గురువారం ఓట్లలెక్కింపు కేంద్రం వద్ద కొంతసేపు హంగామా చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మల్టీ కిషోర్ మహేశ్వరి కన్నా తాను సుమారు 12 వేల ఓట్ల వెనుకబడి ఉన్నట్టు తెలియగానే ఆయన ఓ ఎర్రని వస్త్రాన్నే ‘ఉచ్చు’లా తన మెడకు బిగించుకున్నాడు. ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని, ఏదో గోల్ మాల్ జరిగిన కారణంగానే తనకు తక్కువ ఓట్లు వస్తున్నాయని ఆరోపిస్తూ.. ధర్నా చేశాడు.
కొన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సరిగ్గా సీల్ చేయలేదని, ఇందుకు నిరసనగా తన మెడ చుట్టూ దీన్ని బిగించుకుంటున్నానని ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా అందరినీ హడలెత్తించాడు.
తన సమస్యను రిటర్నింగ్ అధికారులకు విన్నవించుకున్నా వారు పట్టించుకోలేదని దుయ్యబట్టాడు. సోలంకీ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఆయన మద్దతుదారులు యత్నించారు.
అయినా ఆయన వినకుండా చాలాసేపు కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసనకు దిగాడు. కానీ ఈయన ఇంత చేసినా గాంధీధామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మల్టీ కిషోర్ మహేశ్వరి గెలుపొందారు. ఇక్కడ 47.86 శాతం పోలింగ్ జరిగింది. కచ్ లోక్ సభ నియోజకవర్గంలోని ఈ సెగ్మెంట్ ని ఎస్సీ అర్బన్ కేటగిరీలో పేర్కొన్నారు.