గుజరాత్‌లో 38 మంది కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ సస్పండ్ చేసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వారిని సస్పండ్ చేసినట్టు పార్టీ వెల్లడించింది. వారిని ఆరేండ్ల పాటు సస్పెండ్ చేసినట్టు పార్టీ పేర్కొంది.
పార్టీలో మొత్తం 95 మంది కార్యకర్తలపై 71 ఫిర్యాదులు అందాయి. దీంతో ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు క్రమ శిక్షణ కమిటీ ఈ నెలలో రెండు సార్లు సమావేశమైంది. విచారణ అనంతరం వారిని సస్పెండ్ చేసినట్టు కన్వీనర్ బాలూభాయ్ పటేల్ వెల్లడించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో 38 మంది కార్యకర్తలపై సస్పెన్షన్ వేటు వేశామని ఆయన తెలిపారు. ఎనిమిది మందికి హెచ్చరికలు జారీ చేసినట్టు వివరించారు. మిగతా వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన చెప్పారు.
సస్పెండ్ అయిన 38 మందిలో సురేందర్ నగర్ జిల్లా అధ్యక్షులు రాయ్ భాయ్ రాథోడ్, నర్మదా జిల్లా అధ్యక్షుడు హరేంద్ర వాలంద్, నాందోడ్ మాజీ ఎమ్మెల్యే పీడీ వాసవతో పాటు పలువురు ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 182 స్థానాలకు గాను 17 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది.