సోదర సోదరి ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ ఏదైనా ఉంది అంటే అది రాఖీనే. శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకొనే రాఖీ సోదర ప్రేమకి సంకేతం. సోదరుల క్షేమం కోరుతూ అక్కా, చెల్లి వారి చేతికి రాఖీ కడుతారు.
ఎలాంటి కష్టమొచ్చినా తోడుంటానని సోదరుడు భరోసా ఇస్తాడు. సోదరి సంతోషపడేలా బహుమతులు ఇస్తుంటారు. దేశ, విదేశాల ఎక్కడైనా సరే తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి స్వీట్లు పంచుతారు. ఈ తరుణంలో మార్కెట్లో వివిధ రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి.
రాఖీల్లో ఫ్యాషన్ బాగా పెరిగిపోతోంది. రక రకాల డిజైన్లు మార్కెట్ లో దొరుకుతున్నాయి.రాఖీల కోనుగోల కోసం వచ్చే వారితో మార్కెట్ లో సందడి నెలకొంది. క్రేజ్ ను సైతం వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు.
రక్షా బంధన్ సమీపిస్తుండడంతో వివిధ రాఖీలు మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో పండుగకు ముందు సూరత్ లో వజ్రాల రాఖీలను విక్రయిస్తున్నారు. పర్యావరణకు అనుకూలమైన రాఖీలను తయారు చేస్తున్నట్లు ఓ వ్యాపారి వెల్లడించారు.
రీ సైకిల్ చేసుకొనే విధంగా బంగారంతో తయారు చేశామన్నారు. డైమండ్ ను కూడా ఉపయోగించడం జరిగిందన్నారు. దీని ధర దాదాపు రూ. 3 వేల నుంచి రూ. 8 వేల వరకు ఉంటుందని వ్యాపార వేత్త రజనీకాంత్ తెలిపారు.