గుజరాత్‌లో తమకు ఎదురులేదని బీజేపీ మరోసారి నిరూపించుకుంది. మోడీ,అమిత్ షా ద్వయం తమ వ్యూహాలతో బీజేపీకి చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టారు. ఎన్నికల ముందు రెబెల్స్ బెడద వంటివి కనిపించినా బీజేపీ విజయంపై అవి ఏ మాత్రమూ ప్రభావం చూపించలేకపోయాయి.
ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాని మోడీ ప్రచారం బీజేపీకి బాగా మేలు చేసింది. ఆయన నేతృత్వంలో పార్టీ దూకుడుగా ప్రచారం చేసింది. ఓ వైపు ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజల్లో వ్యతిరేకత, రెబల్స్ బెడద ఉన్నప్పటికీ మోడీ చరిష్మా ముందు అవేమి నిలబడలేకపోయాయి.
ఆకట్టుకున్న మోడీ కొత్త నినాదం…
ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ ఇచ్చిన కొత్త నినాదం బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ‘గుజరాత్ ను నేనే తీర్చి దిద్దాను’ అనే నినాదం ప్రజల్లోకి బాగా దూసుకుపోయింది. ఈ నినాదం ఓటర్లను బాగా ఆకట్టుకుంది. బీజేపీకి వేసే ఓటు మోడీ ఖాతాలో పడుతుందన్న నినాదంలో ఓటర్లలో సెంటిమెంట్ ను రగిలించారు.
కమలం వైపు మళ్లిన పాటీదార్లు….
రెండు దశాబ్దాలుగా పాటిదార్లు బీజేపీ వెంట ఉన్నారు. రాష్ట్రంలో పాటిదార్లు 15శాతం వరకు ఉన్నారు. 2015లో హార్దిక్ పటేల్ నాయకత్వంలో పాటిదార్ ఉద్యమం వచ్చిన తర్వాత పాటిదార్లు బీజేపీకి దూరమయ్యారు. ముఖ్యంగా ఉద్యమాన్ని బీజేపీ అణచివేసిన తీరుపై పాటిదార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2017 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావాన్ని చూపించింది. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు మాత్రమే రాగా, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో బీజేపీ జాగ్రత్త పడింది. పటేల్‌ల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కొవిడ్ అనంతరం సీఎం విజయ్ రూపానిని మార్చి ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్‌కు పగ్గాలు అప్పగించారు.
మరోవైపు పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చింది. పటేళ్లకు రిజర్వేషన్ల రూపంలో సాయం అందుతుందని బీజేపీ ప్రచారం చేసింది. ఈ క్రమంలో పాటిదార్లు బీజేపీకి దగ్గరయ్యారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించారు.
మద్దతుగా నిలిచిన దళిత ఓటర్లు…
రాష్ట్రంలో 1995 నుంచి దళితులు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. రాష్ట్రంలో 13 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు ఉన్నాయి. 2017లో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీజేపీ వెనకబడిపోయింది. మొత్తం 13 స్థానాల్లో బీజేపీ 7, కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధించాయి.
కానీ ఈ సారి దళితులను బీజేపీ ఈసారి ఆకట్టుకుంది. దళిత సామాజికి వర్గానికి చెందిన పలువురు నేతలకు వివిధ ప్రభుత్వ సంస్థల్లో పదవులు కట్టబెట్టింది. దళితుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు బీజేపీకి కొంత మేర లబ్ధి చేకూర్చాయి.
లాభించిన గిరిజన ఓట్లు….
రాష్ట్రంలో ఎదురులేని శక్తిగా బీజేపీ ఎదిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ తో పోలిస్తే ఆదివాసీల ఓట్లు, సీట్లు గెలుచుకోవడంలో మాత్రం బీజేపీ వెనుకబడింది. ప్రతి ఎన్నికల్లోనూ ఆదివాసీలు కాంగ్రెస్ వైపు నిలిచారు. రాష్ట్రంలో అధికారాన్ని సాధించలేకపోయినా ఆదివాసీల ఓట్లను కాంగ్రెస్ పొందుతూ వస్తోంది.
2017 ఎన్నికల్లో 27 రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ కు 15, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి ఆదివాసీ సీట్లను గెలుచుకునేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేసింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఆదివాసి ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే పర్యటించారు. దీంతో పాటు 10 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌సిన్హ్ రత్వాను పార్టీలో చేర్చుకుంది. గిరిజన ఓటు బ్యాంకుపై ఆయనకు ఉన్న పట్టుండడం బీజేపీకి కలిసొచ్చింది.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక….
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఆప్ అన్ని విధాల కృషి చేసింది. ఉచిత హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 2017 ఎన్నికల్లో ఆప్ అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఆప్ ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అనేక నియోకవర్గాల్లో బీజేపీకి లబ్ది చేకూర్చాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో వారికి చాన్స్
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను బీజేపీ పక్కనబెట్టింది. వారి స్థానంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చింది. పాత వారిలో సీఎం, మరో ఎమ్మెల్యేకు మాత్రమే టికెట్లు కేటాయించింది. ఈ సారి 62 మంది కొత్త అభ్యర్థులకు స్థానం కల్పించింది. టికెట్లు రాని వారిలో అనేకమంది మంత్రులు ఉన్నారు. రెబెల్స్ బెడద పార్టీపై పడకుండా పార్టీ తగు జాగ్రత్తలు తీసుకుంది.
లాభించిన కాంగ్రెస్ వైఫల్యాలు..
ఈ సారి ఎన్నికల్లో ప్రచారంలో కాంగ్రెస్ చాలా వెనుకబడిపోయింది. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను కాంగ్రెస్ సమర్థవంతంగా ఎండగట్టలేకపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకటి రెండు సభల్లో మాత్రమే పాల్గొన్నారు. ఆయన ఎక్కువగా భారత్ జోడో యాత్రపై దృష్టి పెట్టారు. అటు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.
హిందుత్వ అజెండా…
ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో బీజేపీ హిందుత్వ నినాదాన్ని వినిపించింది. హిందూ వర్గాన్ని ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలోనూ ప్రయత్నం చేసింది. ద్వారకాను పశ్చిమ భారత్ లోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని హామినిచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీ కృష్ణుడి విగ్రహం, త్రీడీ భగవద్గీత ఎక్స్‌పీరియెన్స్ జోన్‌తో పాటు గ్యాలరీ నిర్మాణం చేపడతామంటూ పలు హామీలు ఇచ్చింది. దీంతో హిందువులు బీజేపీ వైపు మొగ్గు చూపారు.