గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. డిసెంబరు 1 న. గురువారం తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో 2014 నుంచి.. ఇప్పటివరకు.. ఆ తరువాత కూడా రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లిం ఓటర్ల విషయానికే వస్తే మోడీ ప్రభుత్వ పాలసీలు వారికి ప్రయోజనం కల్పిస్తూనే ఉన్నాయని ఓ అంచనా.. తమ వర్గం వారి ఓట్లను చేజిక్కించుకునేందుకు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ యత్నిస్తుండగా, మరి కొందరు ముస్లిం నేతలు 2002 నాడు ఇక్కడ తమకు తగిలిన ‘గాయాలను’ గుర్తుకు తెచ్చి వాటి ద్వారా ఈ ఎన్నికల్లో ప్రయోజనం పొందజూస్తున్నారు.
ముస్లిములను మోడీ ప్రభుత్వం ఏకాకులను చేసిందని, తమ వర్గ సామాజిక-ఆర్ధిక ప్రయోజనాలకు బీజేపీ చేసిందేమీ లేదని ఒవైసీ ఆరోపిస్తూ ఈ రాష్ట్రంలో బలం కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ డేటా చూస్తే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది. తమ బీజేపీ ప్రభుత్వం గుజరాత్ లో ముస్లిములకు కల్పించిన వివిధ రాయితీలు, సౌకర్యాలను నాటి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి ఈ ఏడాది ఆరంభంలోనే పార్లమెంటుకు వివరించారు. పీఎం ఆవాసన యోజన కింద గుజరాత్ లో 2.31 కోట్ల ఇళ్లను నిర్మించగా.. వీటిలో 31 శాతం మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలవారికి కేటాయించడం జరిగిందని ఆయన చెప్పారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 33 శాతం మంది మైనారిటీలు లబ్ది పొందారని, అలాగే పీఎం ఉజ్వల యోజన కింద 9 కోట్ల మందిలో 37 శాతం మంది మైనారిటీలకు ప్రయోజనం లభించిందని ఆయన చెప్పారు. పీఎం ముద్ర పథకం ద్వారా 36 శాతం మంది లబ్ది పొందినట్టు పేర్కొన్నారు. తన మైనారిటీ వ్యవహారాల శాఖ ద్వారా ముస్లిములకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసినట్టు వివరించారు.
వీటిలో నవ్య సవేరా, సీఖో ఔర్ కమావో, నయీ మంజిల్, నయీ రోష్నీ, నయీ ఉడాన్, గరీబ్ నవాజ్ ఎంప్లాయ్ మెంట్ స్కీం. షాదీ ముబారక్ స్కీం వంటివి ఉన్నట్టు నక్వి పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీలకు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్, .. ఇంకా స్కాలర్ షిప్పులు, ఫెలోషిప్పులు.. ఇలా పలు సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. నయా సవేరా పథకం కింద గత మూడేళ్లలో 30 వేలమందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందారన్నారు. వీరిలో ఏపీ నుంచి 17 వేలమంది విద్యార్థులున్నట్టు చెప్పారు. ఇలాగే వివిధ స్కీముల కింద మోడీ ప్రభుత్వం ముస్లిం వర్గాల అభివృద్ధికి అనువుగా అన్ని విధాల చర్యలు తీసుకున్నట్టు ఆయన వివరించారు. మరి ఈ ఎన్నికల్లో ఈ వర్గం వారు మోడీ ప్రభుత్వానికి ఎలా జై కొడతారో వేచి చూడాల్సి ఉంది.