తమ పార్టీకి జాతీయ హోదా లభించేలా చూసినందుకు గుజరాత్ ప్రజలకు మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మా పార్టీకి దాదాపు 15 శాతం ఓట్లు లభించాయని, 2024 ఎన్నికల్లో ఇక ప్రధానంగా పోరు ప్రధాని మోడీ, మా పార్టీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యే ఉంటుందని ఆయన చెప్పారు. కేవలం 10 ఏళ్ళ కాలంలో ఆప్ ఈ హోదా సాధించిందన్నారు. ఆప్ పట్ల గుజరాతీలు విశ్వాసం చూపారని, ఇది హర్షదాయకమని అన్నారు.
ఒక పార్టీకి జాతీయ హోదా లభించాలంటే నాలుగు రాష్ట్రాల్లో కనీసం 6 శాతం ఓట్లు సాధించి ఉండాలి. ఢిల్లీ, పంజాబ్ ల తరువాత ఇప్పుడు గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో తాజా పరిణామాల దృష్ట్యా ఇక నేషనల్ పార్టీ హోదా పొందనుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు.
గుజరాత్ ప్రజల ఓటు కారణంగా ఆప్ ఇకపై ఈ హోదా పొందుతోందని, ఇందుకు దేశ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశారు. దేశ రాజకీయాల్లో మొదటిసారిగా విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిన ఆప్ కి జాతీయ హోదా దక్కడం తమ పార్టీవాదులందరికీ ఎంతో గర్వ కారణమన్నారు.
ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, బహుజన్ సమాజ్ పార్టీలను జాతీయ పార్టీలుగా ఈసీ గుర్తిస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి 53.3 శాతం, ఆప్ కి 12 శాతం ఓట్లు లభించగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 26.9 కి దిగజారింది.