మరో ఏడాదిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేజిక్కిచ్చు కోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీని ఓడించి సొంత రాష్ట్రంలో ప్రధాని మోడీకి షాక్ ఇవ్వాలని ఆప్ వ్యూహాలు రచిస్తోంది.
అయితే గుజరాత్ లో బీజేపీని ఓడించడం అంత తేలికైన పని కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ ఇమేజ్ ను, ‘గుజరాత్ మోడల్ అభివృద్ధి’ని మరిపించి ప్రజలను ఆకట్టుకోవాలంటే ఆప్ భగీరథ ప్రయత్నమే చేయాలని రాజకీయ పండితులు చెబుతున్నారు.
ఢిల్లీ తరహా అభివృద్ధి మంత్రం
ఇటీవల గుజరాత్ లోని భరూచ్ లో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ‘గుజరాత్ మోడల్ అభివృద్ధి’ని కేజ్రీవాల్ విమర్శించారు. అయితే ఆయన కేవలం రాష్ట్రంలోని పాఠశాలలు, ఆస్పత్రుల్లో సమస్యలను మాత్రమే ఎత్తి చూపారు. తనకు అధికారం ఇస్తే నాణ్యమైన విద్య, సమర్థవంతమైన వైద్య వ్యవస్థను నిర్మిస్తానని చెబుతున్నారు.
నరేంద్రుడి అభివృద్ధి పనుల ముందు ఢిల్లీ మోడల్ నిలుస్తుందా..?
బీజేపీ పాలనలో అభివృద్ధిలో గుజరాత్ పరుగులు పెట్టింది. నాలుగు, ఆరు, ఎనిమిది లైన్ల జాతీయ రహదారులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా ప్రాథమిక అవసరాలైన నీటి సమస్యను తీర్చడంపై మోడీ సర్కార్ గతంలో దృష్టిపెట్టింది. పలు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదరవుతున్నప్పటికీ సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టి ఆ నీటి ద్వారా గుజరాత్ ప్రజల అవసరాలను తీర్చింది.
మరో వైపు యూనిటీ ఆఫ్ స్టాచ్యు లాంటివి నిర్మించి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసింది. ఫలితంగా ప్రజలకు ఉపాధి పెరిగింది. కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనకు వచ్చే కొద్ది రోజుల ముందే రాష్ట్రంలో 22వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం గమనార్హం. దీంతో ప్రజల్లో మోడీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇలాంటి అభివృద్ధి ముందు ఢిల్లీ మోడల్ ఎంత వరకు ఆప్ కు లబ్ది చేకూరస్తుందో చూడాలి.
గిరిజన ఆదివాసి ప్రాంతాల్లో ఆప్ పట్టు సాధించేనా…!
అభివృద్ధిలో గుజరాత్ ను అగ్రస్థానంలో నిలిపేందుకు మోడీ చేసిన ప్రయత్నాలను ఎవరూ కాదనలేరు. అయితే ఆ అభివృద్ధి ఫలాలు కొన్ని గిరిజన ప్రాంతాలకు ఇంకా అందలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్, ఆప్ ప్రయత్నిస్తున్నాయి.
అయితే ఇటీవల ఏర్పడిన భారతీయ గిరిజన పార్టీ (బీటీపీ) ఈ ప్రాంతాల్లో మంచిపట్టును కలిగిఉంది. ఈ పార్టీకి మంచి గిరిజన ఓటు బ్యాంకు ఉంది. దీంతో బీటీపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. కానీ ఇటీవల ఈ గిరిజన ప్రాంతాలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇటీవల సూక్ష్మ అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తోంది. దీంతో ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతాలు కొంత అభివృద్ధిని చూస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఈ ప్రాంతాల్లో పట్టు సాధించి బీజేపీపై విజయం సాధించడం ఆప్ కు కష్టంతో కూడుకున్న పని అని రాజకీయ పండితులు అంటున్నారు.