ఐపీఎల్ సీజన్ 15 చివరి దశకు చేరుకుంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్ జట్లు తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడేశాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగింది ఈ మ్యాచ్. రాజస్థాన్ పై గుజరాత్ గెలుపొందింది. ఈ విజయంతో ఫైనల్ కు చేరిపోయింది.
ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఆదిలోనే యశస్వి జైస్వాల్(3) ఔట్ అయి నిరాశపరిచినా.. తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్(47) ధాటిగా ఆడాడు. ఆ తర్వాత పడిక్కల్(28) కాసేపు మెరుపులు మెరిపించినా.. నిలదొక్కుకుంటున్నాడు అనుకునే టైమ్ లో ఔట్ అయ్యాడు. ఇక హెట్మెయర్(4) నిరుత్సాహ పరచగా.. ఇన్నింగ్స్ చివరి బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించి బట్లర్(89) రనౌట్ అయ్యాడు. చివరకు అది నోబాల్ అని తేలింది. అశ్విన్(2 నాటౌట్) క్రీజులోకి రాగా తర్వాతి బంతిని బౌలర్ వైడ్ వేశాడు. కానీ.. రన్ కోసం ప్రయత్నించి పరాగ్(4) రనౌట్ అయ్యాడు.
నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్.. 188 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గుజరాత్ కు 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న గుజరాత్ ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ముందుగా గిల్, సాహా బ్యాటింగ్ కు దిగగా.. సాహ డకౌట్ అయ్యాడు. గిల్(35, మ్యాథ్యూ(35) నిలకడగా ఆడుతూ వచ్చారు. 8వ ఓవర్ లో ఒకరు, పదో ఓవర్ లో మరొకరు ఔట్ కావడంతో అప్పటికి క్రీజ్ లో డేవిడ్ మిల్లర్(68 నాటౌట్), హార్దిక్ పాండ్యా(40 నాటౌట్) ఉన్నారు.
కేవలం 27 బంతుల్లో 40 పరుగులు సాధించాడు పాండ్యా, అలాగే 38 బంతుల్లో మిల్లర్ 68 రన్స్ చేశాడు. ఇందులో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. 19వ ఓవర్ లో బౌలర్ కాస్త కట్టడి చేసినా.. 20వ ఓవర్ లో సిక్సర్ల మోత మోగింది. లాస్ట్ ఓవర్ కి గుజరాత్ కు 16 పరుగులు కావాల్సి ఉండగా.. వరుసగా 3 సిక్సర్లు బాదాడు మిల్లర్. దీంతో స్కోర్ 191 పరుగులు అయింది. గుజరాత్ ఫైనల్ కు చేరిపోయింది.