వివాదాస్పద నిర్ణయాలకు ఎప్పుడూ అగ్రరాజ్యం కేంద్రబిందువుగా నిలుస్తోంది. అమెరికాలో కొన్నేళ్లుగా గన్ కల్చర్ పై వ్యతిరేకత తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రతీ ఏటా వేలాది మంది గన్ కల్చర్ కు బలై పోతున్నారు. గడిచిన నెలలో టెక్సాస్ లోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో సుమారు 19 మంది చిన్న పిల్లలు బలయ్యారు. ఈ ఘటనలోనే ఇద్దరు టీచర్స్ కూడా మృతి చెందారు. ఎన్నో నిరసనలు, వివాదాలతో భగ్గుమంటున్న అమెరికాలో.. ఇన్నాళ్లుగా చర్చలకే పరిమితమైన తుపాకీ హింస నియంత్రణ బిల్లుకు అమెరికాలో ఎట్టకేలకు మోక్షం లభించింది.
అమెరికాలో ఇకపై తుపాకుల వినియోగం ఉండకూడదని.. చిన్న పిల్లల చేతిలో కేవలం పుస్తకాలు మాత్రమే ఉండాలని బైడెన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే గన్ కల్చర్ పై నియంత్రణ బిల్లును తీసుకువచ్చారని,.. అమెరికా ప్రజలను తుపాకుల నుంచీ కాపాడేందుకు ఈ బిల్లు తప్పకుండా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
ఈ బిల్లు అమలులోకి వస్తే చిన్న పిల్లలకు తుపాకులు ఇచ్చే విషయంపై కఠినమైన వైఖరి తీసుకోవడమే కాకుండా అర్హత పొంది తుపాకులు వాడే వారు ప్రమాదకరమైన పద్దతులను పాటిస్తే వారి లైసెన్స్ లు నిలిపివేయబడేలా చర్యలు ఉంటాయని బైడెన్ హెచ్చరించారు. అలాంటి వారికి తుపాకి లైసెన్స్ మరోసారి ఇవ్వకుండా ఉండేలా చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.
మొత్తానికి అమెరికాలో ఇకపై 21 ఏళ్లలోపు వారు తుపాకులు కొంటే వారి నేపథ్యంపై పూర్తి వివరాలను సేకరిస్తారు. పాఠశాలల్లో భద్రతను పెంచడానికి, ప్రజల మానసిక సమస్యల నివారణకు భారీగా నిధులు కేటాయిస్తారు. ఎవరి చేతుల్లోనైనా తుపాకులు ఉండటం ప్రమాదకరమని భావిస్తే.. వాటిని స్వాధీనం చేసుకొని లైసెన్సును రద్దు చేయనున్నారు.