తుపాకీ, పేలుడు పదార్థాలతో ఓ దుండగుడు యావత్ అమెరికాను తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. నలుగురు వ్యక్తులను బందించి వారిని అడ్డు పెట్టుకొని పది గంటల పాటు వీరంగం సృష్టించాడు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అమెరికా ప్రత్యేక దళాలు దుండగుడిని హతమార్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. బందీలను సురక్షితంగా కాపాడారు. డల్లాస్ కు కొద్ది దూరంలో ఉన్న కోలీవిల్ పట్టణంలోని సినగాగ్ గా పిలిచే యూదుల ప్రార్థనా మందిరంలోకి శనివారం ఓ దుండగుడు చొరబడ్డాడు. అందులో ఉన్న రబ్బీ గా పిలిచే మతగురువు సహా నలుగురు వ్యక్తుల్ని బందించాడు. తర్వాత ఓ వీడియోను బయటకు వదిలాడు.
అమెరికా జైల్లో ఉన్న ఓ పాకిస్థాన్ ఉగ్రవాది ఆఫియా సిద్ధిఖీని వదిలిపెట్టాలని ముష్కరుడు అందులో డిమాండ్ చేసినట్లు కోలీవిల్ పోలీసు వర్గాలు తెలిపాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక దళాలైన స్వాట్ టీం.. కోలీవిల్ పోలీసులతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వచ్చింది. దుండగుడితో మాట్లాడి బందీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టింది. ఈ క్రమంలో ముష్కరుడితో ప్రత్యేక దళాలు చర్చలు కొనసాగించాయి.
ముష్కరుడు విడుదల చేసిన వీడియోలో తన వద్ద పేలుడు పదార్థాలు.. తుపాకీ ఉన్నట్లు పేర్కొన్నాడు. తన వేషధారణను చూసిన పోలీసుల అది నిజమే అని భావించి తదుపరి చర్యలు చేపట్టారు. అయితే.. అతని వద్ద నిజంగానే ఆయుధాలు ఉన్నాయా..? లేవా..? అనే విషయాన్ని మాత్రం ధ్రువీకరించుకోలేకపోయారు. బందీల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బలగాలు ఆచితూచి వ్యవహరించాయి. ఈ క్రమంలో ఒక బందీని దుండగుడు సాయంత్రం 5 గంటల సమయంలో సురక్షితంగా వదిలిపెట్టాడు.
చివరకు రాత్రి 9:30 గంటలకు అందరూ క్షేమంగా బయటకు రావడంతో కథ సుఖాంతం అయ్యింది. అయితే.. వారిని విడిచిపెట్టడానికి ముందు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. బహుశా ముష్కరుడిని హతమార్చేందుకు బలగాలు జరిపిన కాల్పులే అయి ఉంటాయని భావిస్తున్నారు..
ఇప్పటి వరకు ముష్కరుడి వివరాలను అమెరికా బలగాలు వెల్లడించలేదు. ఘటనా స్థలంలోని పరిస్థితిని శ్వేతసౌధం ఎప్పటికప్పుడు సమీక్షించింది. స్వయంగా అధ్యక్షుడు బైడెన్ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం సైతం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. బందీలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.