గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సినిమా నుండి సమంత లేటెస్ట్ పిక్స్ రిలీజ్ చేస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు డైరక్టర్ గుణశేఖర్.
కొత్తగా రిలీజ్ చేసిన ఫోటోల్లో సమంత మెరిసిపోతూ కనిపిస్తోంది. బంగారు వర్ణపు వస్త్రాల్లో, ఒంటి నిండా బంగారంతో మహారాణిలా కనిపిస్తోంది సమంత. వజ్రాభరణాలు సమంత అందాన్ని రెట్టింపు చేశాయి. మెరిసిపోతున్న నగలతో సమతం అందాల అపరంజిలా కనిపిస్తోంది. శాకుంతల మూవీ టీమ్ ఈ పిక్స్ అలా రిలీజ్ చేయగానే ఇలా వైరల్ గా మారాయి. ఇందులో సమంత సహా ఇతర కీలక క్యారెక్టర్లు ధరించిన నగల గురించి గుణశేఖర్ ఆసక్తికర విషయాలు చెప్పారు.
శాకుంతలం సినిమాలో కీలక పాత్రల కోసం రూ. 14 కోట్లు విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు వాడినట్లు గుణశేఖర్ వెల్లడించారు. ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో నిజమైన బంగారు ఆభరణాలు, బంగారంతో చేసిన కిరీటం వాడిన స్ఫూర్తితోనే తన సినిమాలోనూ బంగారంతో చేసిన నగలనే వాడినట్లు చెప్పారు.
సుమారు 15 కిలోల బంగారంతో 14 రకాల ఆభరణాలు తయారు చేయించారు. పూర్తిగా చేతితో చేసిన ఈ ఆభరణాలు సినిమాలోని పాత్రలకు మరింత అందాన్ని, రాజసాన్ని తీసుకువచ్చాయని గుణశేఖర్ తెలిపారు. ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారథ్యంలో వసుంధర జ్యూయెలరీస్ శాకుంతలం కోసం సుమారు 7 నెలల పాటు శ్రమించి ఈ ఆభరణాలను తయారు చేసింది. ఈ నగలను పూర్తిగా చేతితోనే తయారు చేయడం విశేషం.
శకుంతల పాత్ర కోసం 15 కిలోల బంగారంతో 14 రకాల ఆభరణాలు తయారు చేసినట్లు డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు. దుష్యంత మహారాజు పాత్ర కోసం 8 నుండి 10 కిలోల బంగారంతో నగలు తయారు చేశామని చెప్పారు. మేనక పాత్రధారి మధుబాల కోసం 6 కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను రూపొందించినట్లు డైరెక్టర్ చెప్పుకొచ్చారు.