(డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, స్టేట్ యూత్ ప్రెసిడెంట్, తెలంగాణ ముదిరాజ్ మహాసంఘ్)
బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం అసెంబ్లీలో పోరాడిన ’బహుజన గొంతుక’ ఈటల రాజేందర్. అలాంటి వ్యక్తిపై కుట్ర జరుగుతోంది.
ఉద్యమ సమయం నుంచి కేసిఆర్ నమ్మిన ఒక తమ్ముడిలా భుజం కలిపి నడిచి, వారి మధ్య జరిపిన ఏ ముచ్హట కూడా ఇన్ని నాళ్లు బయటికి చెప్పని ఈటల రాజేందర్ ఇప్పుడు ప్రభుత్వ రహస్యాలు బయట పెడుతున్నారని కొన్ని పత్రికలు రాయడంలో అంతరార్ధమేంటి?
ఈటల రాజేందర్‌పై గూడుపుఠాణీ జరుగుతోంది. అతని ఉన్నత వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుయుక్తులు పన్నుతున్నారు. ఇంటిపెద్దలే ఈ కుట్రకు కార్యాచరణ అమలుచేస్తున్నారు. అందులో రెవెన్యూ ఉద్యోగుల్ని పావుల్ని చేస్తున్నారు.
కేసీఆర్ పిలుపుతో తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈటల రాజేందర్.. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఒక పక్క హరీష్‌రావు, మరోపక్క ఈటల రాజేందర్ కేసీఆర్‌కి వలపల, దాపల ఎడ్లలాగా గొడ్డు చాకిరీ చేశారు. కేసీఆర్ విడిచిన ఈటలయ్యారు. ఇప్పుడు ఇంటిపెద్దల కుట్రలకు బలవుతున్నారు.
ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దిగినాక బొడ మల్లన్న.. అని పెద్దాయన ఎప్పుడూ ఒక సామెత చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సామేత తమకు కూడా వర్తిస్తుందని ఏనాడు ఊహించలేదు. ఉద్యమంలో ఏ ఆర్ధిక అవసరం వచ్చినా ముందు నిలబడ్డ కరీంనగర్ పోరు బిడ్డపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. విద్యార్థులకు బెయిల్ ఇప్పించిన రాజేందర్‌ను రాజీనామా చేయించాలని చూస్తున్నారు. ఎంతోమంది అభిమానించే నాయకుడిపై అభ్యంతరకరమైన వార్తలు రాయిస్తున్నరు. బర్తరఫ్ అంటూ బదనాం చేస్తున్నారు.
రెవిన్యూ లీకుల అంటూ సూత్రధారులు.. పాత్రధారులని పంపించి కట్టు కథలు అల్లుతున్నారు. రెవిన్యూ చట్టంలో మార్పులు తెస్తామని, వీఆర్ఓ అధికారాలు తగ్గిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. కలెక్టర్ల మీటింగ్ తర్వాత అన్ని పత్రికల్లో ఆ మీటింగులో ఏం జరిగిందో వార్తలు వచ్చాయి. ఇక లీక్ చేయడానికి ఏముంది…? లీకులు పేరు చెప్పి ఈటలపై రాజద్రోహం కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడున్న కలెక్టర్లలో ఎక్కువమంది రెవెన్యూ ఉద్యోగులే అనే విషయం మర్చిపోతున్నారు. ముందస్తు ప్రణాళికతో రెవెన్యూ ఉద్యోగులను వారే మంత్రి దగ్గరికి పంపించి.. వారే లీకులిచ్చి.. వారే వార్తలు రాయించి…పొమ్మనలేక పొగ పెడుతున్నారు. బదనాం వేయడానికి సిద్ధమయ్యారు. దీనిని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలంతా పిచ్చివాళ్లని అనుకోవద్దు.. మీది మీకే తిప్పికొట్టడం తథ్యం.
ప్రజా సేవలో విరామం లేని నిత్య శ్రామికుడైనటువంటి ఈటల రాజేందర్‌పై తప్పుడు రాతలను రాస్తున్నారు. నిజ నిరూపణలు లేని ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కడంలో భాగంగా నిలువెత్తు నికార్సయిన ఉద్యమకారుడు ఈటల రాజేందర్‌ని కాంగ్రెస్ పార్టీలో చేరమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేశారు. తన భూమిని ఆక్రమిస్తే సొంత భూమిని వొదిలి తెలంగాణ భూమి కోసం నిలబడ్డ నిజాయితీ పరుడు ఈటల రాజేందర్. ఉధ్యమంలో లోబరుచుకోవడానికి ఎవరెన్ని ఎత్తులు వేసినా పట్టించుకోక.. కుట్రలను లెక్కజేయక.. తెలంగాణ గడ్డ కోసం లాఠీలకు, తూటాలకు ఎదురు నిలిచి కొట్లాడిన గుండె వారిది. తెలంగాణ ఉధ్యమంలో సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి నేనున్నా అని ఏకతాటిపై నడిపించిన ధైర్యం వారిది. ఇప్పుడు అతన్ని కాపాడుకునే అవసరం ఉంది. ఈటలను ఎలా బయటికి పంపుతారో చూస్తాం..