పల్నాడులో పర్యటిస్తా - Tolivelugu

పల్నాడులో పర్యటిస్తా

పల్నాటి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం, తీసుకుంటున్న చర్యలపై గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ జయలక్ష్మితో ‘తొలివెలుగు’ తరుఫున జర్నలిస్ట్ శివ ఏచూరి జరిపిన ఇంటర్వ్యూ..

ప్రతిపక్షం చేపట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని మీరు సమర్ధంగా నిలువరించారని అనుకుంటున్నారా?

శాంతి భద్రతల్ని కాపాడటం మా ప్రధానమైన విధి. పల్నాడులో ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేలా ఎవరు ప్రవర్తించినా సహించబోము. అదే చేశాం.

శాంతియుత పంథాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చంద్రబాబు చెబుతున్నా కూడా పోలీసులు ఎందుకు దీన్ని భగ్నం చేసినట్టు?

‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి వైసీపీ నేతలు కూడా అనుమతి అడిగారు. శాంతిభద్రతలను కాపాడే పనిలో ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అంతే!

ఎఫ్పుడూ లేనంత పెద్ద ఎత్తున బలగాలను ‘ఛలో ఆత్మకూరు’ కోసం రంగంలోకి దించారు. అంత అవసరం ఉందా?

టీడీపీ నాయకులు మా నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే మేము ఇంత బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సివచ్చింది. నిబంధనలను అతిక్రమిస్తే ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేగా..

ఈ కార్యక్రమం కోసం తరలివచ్చిన తమ పార్టీ కార్యకర్తలు, నాయకులకు కనీసం అన్నపానాలు కూడా అందకుండా మాడ్చేశారని చంద్రబాబు అంటున్నారు.? అది నిజం కాదంటారా?

వైన్ డీలర్స్ అసోసియేషన్ హాలులో ఉన్న తమ వారికి భోజనాలు రానివ్వటం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు.

నిషేధాజ్ఞలు ఎన్నాళ్లు అమలులో వుంటాయి ?

ఈనెల 12 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది.

అధికార-విపక్ష నిరసనలు, ప్రతి నిరసనలు సరే, అసలు అక్కడ బాధితులకు ఎవరు రక్షగా వుంటారు?

గుంటూరు జిల్లాలో ఉన్న వైసీపీ బాధితులకు పోలీసుల నుంచి పూర్తి స్థాయిలో అండ వుంటుంది. ఎలాంటి దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.

గతంలో జరిగిన దాడులపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ?

గతంలో వచ్చిన ప్రతి పిర్యాదుపై మేము కేసు నమోదు చేశాం. 90 శాతం ఛార్జ్‌షీట్‌లు కూడా దాఖలు చేశాం.

రోజురోజుకూ ప్రజ్వరిల్లుతున్న గొడవలపై చివరగా మీరు చెప్పేదేంటి ?

గురజాల, మాచర్ల నియోజకవర్గాలకు సంబంధించి ఈ గొడవలు జరుగుతున్నాయ్. ఆ రెండు నియోజకవర్గల పరిధిలోని 5 గ్రామాల వారు ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వారందర్నీ సాయంత్రంలోపు వారి వారి గ్రామాలకు వదిలిపెడతాం.

బాధితులకు మీరు ఏం చెప్పదలచుకున్నారు ?

నేను స్వయంగా 4 రోజుల నుంచి పల్నాడులో పర్యటన చేస్తున్నాను. ఇప్పడు కూడా ఆత్మకూరులోనే ఉన్నాను. అన్ని పార్టీల నాయకులకు పోలీస్ రక్షణ కల్పిస్తాం.

Share on facebook
Share on twitter
Share on whatsapp