గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం రేగాయి. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇంట్లో ఉన్న సమయంలో తుపాకీతో ప్రత్యర్థులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. బాలకోటి రెడ్డికి బులెట్ గాయాలు కాగా, అతణ్ని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ కాల్పులను గడ్డం వెంకట్రావు, పమ్మి వెంకటేశ్వర్ రెడ్డి, పూజల రాముడు అనే వ్యక్తులు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా వెన్న బాల కోటిరెడ్డి పని చేశారు. పక్కా ప్లాన్ తో రొంపిచర్ల వైసీపీ ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, అతని అనుచరులు దాడికి పాల్పడినట్లు సమాచారం.
నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆసుపత్రిలో బాలకోటిరెడ్డి పరామర్శించారు. వెన్న బలకోటి రెడ్డి పై హత్యాయత్నం ముమ్మాటికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పనే అని ఆయన అన్నారు.
బాలకోటి రెడ్డికి ఏమైనా జరిగితే వైఎస్ఆర్ సీపీ సర్కారుదే బాధ్యత అని అన్నారు. బాలకోటి రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్ కి తరలించామని టీడీపీ ఇన్-చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు చెప్పారు.