ఓవైపు థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ, మరోవైపు ఓటీటీలో నేరుగా వచ్చే సినిమాలు కూడా కొన్ని ఉంటున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే సుమంత్ హీరోగా నటించిన మళ్లీ మొదలైంది సినిమా నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో సినిమా కూడా చేరింది. సత్యదేవ్ హీరోగా నటించిన గుర్తుందా శీతాకాలం సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సత్యదేవ్, తమన్న హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా గుర్తుందా శీతాకాలం. కన్నడ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ, ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉంది. ఇప్పుడీ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, 7 కోట్ల రూపాయలకు ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.
గుర్తుందా శీతాకాలం సినిమా కాపీరైట్ హక్కుల్ని మ్యాంగో రామ్ దక్కించుకున్నారు. దాదాపు 5 కోట్ల 50 లక్షల రూపాయలకు ఈయన ఈ హక్కులు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈయనే ఈ సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే చర్చలు నడుస్తున్నాయి. మరో 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది.
సత్యదేవ్ సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో అతడు నటించిన 28 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి సినిమాలు నేరుగా స్ట్రీమింగ్ అయ్యాయి. ఒక దశలో సత్యదేవ్ ఓటీటీ హీరో అనిపించుకున్నాడు కూడా. తర్వాత తిమ్మరుసు, స్కైలాబ్ లాంటి సినిమాలు థియేటర్లలోకి వచ్చినప్పటికీ, ఇప్పుడు మరోసారి గుర్తుందా శీతాకాలం సినిమాతో ఓటీటీలోకి ఎంటర్ అవుతున్నాడు ఈ హీరో.