విద్యార్థినులను వాతలు వచ్చేలా చితకబాదాడు ఓ ప్రిన్సిపాల్. ఈ దారుణ ఘటన ఖమ్మంలోని మధిరలోని మహాత్మా జ్యోతి బా పూలే బీసీ గురుకుల బాలికల వసతి గృహంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికల కాళ్లకు వాతలు తేలి కమిలిపోయిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవల ఈ హాస్టల్ ను సందర్శించిన ఓ విద్యార్థి సంఘం నాయకుడికి విద్యార్థినులు హాస్టల్ లో తమ కష్టాలను చెప్పుకున్నారు. వంటలు సరిగా ఉండటం లేదని, కూరల్లో కారానికి బదులు ఎండుమిర్చి మిక్సీ పట్టి వేస్తున్నారని, దీంతో గ్యాస్ ట్రబుల్ అవుతుందని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం విద్యార్థి సంఘం నాయకుడు ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు. విద్యార్థినులను ఇబ్బందులు పెట్టవద్దని సూచించి వెళ్లారు.
దీంతో ఆగ్రహానికి లోనైన ప్రిన్సిపాల్.. 20 మంది బాలికలను ఓ గదిలో బందించి కర్రతో తీవ్రంగా కొట్టాడు. కొందరికి కొట్టిన చోట కమిలిపోయి గాయాలయ్యాయి. ఇక్కడ విషయాలు బయటకు చెబితే.. తమ సంగతి చూస్తానంటూ బెదిరించాడు ప్రిన్సిపాల్.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి వసతి గృహాన్ని సందర్శించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని జిల్లా అదనపు కలెక్టర్ ను కోరారు.