గవర్నర్ కు ప్రాధాన్యత ఇవ్వడం లేదనడం బీజేపీ నేతల అవగాహన రాహిత్యమన్నారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. సమావేశాలకు గవర్నర్ ను పిలవాలని చెబుతున్న బీజేపీ నాయకులు.. శాసనసభ ప్రొరోగ్ గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
బీజేపీ కుటిల యత్నాలు తిప్పికొడతామన్నారు గుత్తా. బండి సంజయ్ అవగాహనాలేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను పార్టీలాగే వాడుకుంటోందని ఆరోపించారు.
పలు సందర్భాల్లో ఉమ్మడి శాసనసభకు గవర్నర్ ను పిలువకుండానే సమావేశాలు నిర్వహించారని గుర్తుచేశారు గుత్తా. రాజ్యాంగం కల్పించిన హక్కులనే రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని చెప్పారు. అసలు.. గవర్నర్ వ్యవస్థను కాంగ్రెస్, బీజేపీ నిర్వీర్యం చేశాయని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్.. గవర్నర్ పాత్రను రాజకీయంగా పరిమితం చేశాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత ఆ రెండు పార్టీలకు లేదని చెప్పారు. బీజేపీకి అభ్యర్థులు లేరని.. కాంగ్రెస్ లో రోజూ తన్నులాటేనని సెటైర్లు వేశారు. అలాంటిది 2023లో అధికారంలోకి రావడం ఖాయమని ఆ రెండు పార్టీల నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేని నావలాగా సాగుతోందని.. ఎప్పుడు ఎటు కొట్టుకుపోతుందో తెలియదని విమర్శించారు.