రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహంలా మారిపోయారని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలు ఏవీ ఆయనకు పట్టవంటూ ఆరోపించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
రాజ్యాంగంపై కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులేదన్నారు గుత్తా. బీజేపీ నేతలకు దమ్ము ఉంటే బయ్యారం స్టీల్ ప్లాంట్, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీని తీసుకురావాలని సవాల్ విసిరారు. బీజేపీ నాయకులు దమ్ము, ధైర్యం లేని చేతకానీ దద్దమ్మల్లా తయారయ్యారని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని.. కేటాయించే నిధుల్లో కోత పెడుతోందని ఆరోపించారు సుఖేందర్ రెడ్డి. రాష్ట్ర విభజన హామీలను గాలికొదిలేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై అక్కసు, వ్యత్యాసం చూపెడుతోందని విమర్శించారు.
కేంద్రం ప్రభుత్వ సంస్థలను విక్రయించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు గుత్తా. మోడీ పాలనలో అంబానీలు, ఆదానీలు తప్ప పేద ప్రజలెవరూ బాగుపడలేదని ఆరోపించారు. కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్న ఆయన.. అది చూసి ఓర్వలేక బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శలు చేశారు.