ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మరో కుంపటి రాజుకుంది. గత కొన్నేళ్లుగా ఉప్పు-నిప్పులా ఉండే మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి,మంత్రి జగదీష్ రెడ్డి వర్గాల మధ్య ఇప్పుడు కొత్త పంచాయితీకి తెరలేసింది. అయితే ఈ సారి దానికి ఆద్యుడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కావడం విశేషం. హుజూర్ నగర్ కాంగ్రెస్ నాయకులకు “గుత్తా” వల వేయడం… చివరకు ఆ పంచాయితీ కాస్తా గవర్నర్ వద్దకు చేరడంతో విషయం పెద్దదైంది.
అసలు ఆ వివాదం వెనుక దాగున్న అసలు విషయం గమనిస్తే… హుజూర్‌నగర్ బై ఎలక్షన్స్ అధికార పార్టీ నేతల్లో చిచ్చు రేపుతోంది. గులాబీ బాస్ కు కూడా నేతల వ్యవహారం కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. అసలే అంతర్గతంగా విభేదాలున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డిల మధ్య వివాదం మరింత ముదిరిపోయింది. ఇక వీరిద్దరి మధ్య కొత్త గొడవకు ఏకంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కారణమని టాక్. ఇక ఈ గొడవ కాస్తా గవర్నర్ తమిలిసై వద్దకు చేరింది. వారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారోనని ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది.
అసలు ఉత్తమ్ బయటపెట్టిన గులాబీ నేతల గుట్టే౦టీ ? ఇందులో మంత్రి జగదీశ్ రెడ్డి,గుత్తా ల మధ్య గొడవకు దారి తీసిన పరిస్థితేంట౦టే… హుజూర్‌నగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. హుజూర్ నగర్ గడ్డపై ఎలాగైనా గులాబీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేతలకు బాస్ దిశానిర్దేశం చేశారు. మండలానికో నేతను ఇంచార్జ్‌గా నియమించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా… పరిమితికి మించి గుత్తా వ్యవహరించారని ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ ఎంపీగా మూడు సార్లు పనిచేసిన అనుభవం ఉంది. హుజూర్ నగర్ లో కాస్తో,కూస్తో పట్టుంది. గతంలో టీడీపీ, కాంగ్రెస్ లో పని పనిచేసిన అనుభవం ఉంది. పాత పరిచయాలతోనే కొంతమంది నాయకులు , కార్యకర్తలతో స౦బంధాలు మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇక్కడే గుత్తా పప్పులో కాలేశాడు. పాత పరిచయాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలతో ఫోన్ మాట్లాడడం గుత్తాకు పెద్ద మైనస్ అయ్యిందట. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సపోర్ట్ చేయాలని నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలతో గుత్తా మాట్లాడారని ఉత్తమ్ బలమైన వాదన. అంతేకాదు శాసనమండలి చైర్మన్ హోదాలో నాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ గవర్నర్ కు లేఖ కూడా రాశారు ఉత్తమ్.
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఆ లేఖ అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగిరితే తనకు మంత్రి పదవి ఖాయమని, కాంగ్రెస్ కార్యకర్తలతో గుత్తా చర్చించినట్టు, గవర్నర్ కు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నాడు ఉత్తమ్. వచ్చే కేబినెట్ విస్తరణలో మంత్రులు మల్లారెడ్డి,జగదీశ్ రెడ్డిలలో ఒకరిని పక్కన పెట్టి కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చాడని గుత్తా కాంగ్రెస్ నేతలతో నోరు జారాడట. ఇక ఈ విషయం కాస్తా మంత్రి జగదీష్ రెడ్డికి తెలియడంతో గుత్తా మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడట. పోయి పోయి తనకే ఎసరు పెట్టె ప్రయత్నాలు చేస్తుండడంతో విషయం బాస్ దగ్గర తేల్చుకునేందుకు మంత్రి జగదీష్ రెడ్డి సిద్ధమవుతున్నారట కూడా ఆయన గ్రూప్ సభ్యులంటున్నారు. మొత్తానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోయి పోయి అధికార పార్టీ నేతల్లోనే చిచ్చు రేపింది. ఇక ఉత్తమ్ టీమ్ గుత్తా వ్యవహారాన్ని ఫోన్ రికార్డ్ తో సహా బయట పెడతాననడంతో గులాబీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఉత్తమ్ సేకరించిన ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనన్న ఉత్కంఠ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక వేదికగా మొదలైన ఈ గొడవ ఎటు నుంచి ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.