పీఎఫ్ఐ వంటి సంస్థలు ఐఎస్ఐ కనుసన్నల్లో నడుస్తున్నాయని ఆరోపించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. అలాంటి సంస్థలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కర్నూలులో బీజేపీ ప్రజా నిరసన సభ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన జీవీఎల్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఢిల్లీలో పీఎఫ్ఐ మత అల్లర్లకు పాల్పడిందన్నారు జీవీఎల్. దేశంలో హిందూ ధర్మానికి పెను ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ప్రజాగ్రహ సభ నిర్వహించి సీఎం జగన్ ను శరణు ప్రభు అంటూ ఢిల్లీ వెళ్లేలా చేశామని విమర్శించారు.
ఏపీలో 5 శాతం ముస్లింలు, ఒక శాతం క్రిస్టియన్లు ఉన్నారని చెప్పారు జీవీఎల్. వారి కోసం ప్రతీ వాడలో మసీదులు, చర్చిలను ఏపీ సర్కార్ నిర్మిస్తోందని మండిపడ్డారు. నరేగా నిధులతో ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. మదర్సాలను మూసివేయాలని డిమాండ్ చేశారు జీవీఎల్.
ఇక ఇదే సభలో మాట్లాడిన మరో ఎంపీ టీజీ వెంకటేష్.. హిందువులకు న్యాయం జరగకపోతే ప్రశ్నిస్తే మతోన్మాదం అంటూ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మకూరులో తీవ్రవాద భావాలు ఉన్న కొందరు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారని గుర్తు చేశారు. బీజేపీ ఆశీర్వాదం ఉన్నందువల్లే వైసీపీ ప్రభుత్వం నిలదొక్కుకుని ఉందన్న ఆయన.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు టీజీ.