ఢిల్లీ: అమరావతిలో రాజధానిని కొనసాగించే యోచనలో వైసీపీ ప్రభుత్వం లేదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో ప్రభుత్వం విముఖత చూపిస్తోందని ఆయన అన్నారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. రాజధానిని మారిస్తే భూములిచ్చిన రైతులు నష్టపోతారని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని చెప్పారు. కాకపోతే, రాజధానిపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీస్తున్నాయని విమర్శించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజాప్రయోజనాల కోసం ఉండాలని.. రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా ఉండకూడదని జీవీఎల్ హితవు చెప్పారు. రాజధాని ప్రాంతంలో భవనాల నిర్మాణానికి రూ.2,500 కోట్లిస్తామని కేంద్రం ఒప్పుకొందని.. వాటిలో రూ.1500 కోట్లు తాత్కాలిక భవనాలకే ఉపయోగించుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం అనుకున్న రీతిలో అమరావతిని అభివృద్ధి చేయలేదని జీవీఎల్ దుయ్యబట్టారు.