సోము వీర్రాజు ఆధ్వర్యంలో గుడివాడ వెళ్తున్న బీజేపీ బృందాన్ని అడ్డుకోవడాన్ని ఖండించారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆంధ్ర సంప్రదాయాలపై నిషేధం ఉందా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ అర్ధనగ్న డాన్సులకు ‘ఊ’.. ముగ్గుల పోటీలకు ‘ఊ ఊ’ అంటారా? అంటూ మండిపడ్డారు.
సోము వీర్రాజు సహా ఇతర నాయకులను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జీవీఎల్. కొంతమంది ఐపీఎస్ అధికారులు వైపీఎస్(వైసీపీ పోలీస్ సర్వీస్)గా పనిచేస్తున్నారని ఆరోపించారు. సంప్రదాయాలను కాపాడేందుకు ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు.
సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా ఎలా జరుపుకుంటామో తెలియజేసేందుకు గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించింది బీజేపీ బృందం. అయితే సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం రమేష్ సహా పలువురు నేతలను పోలీసులు నందమూరు దగ్గర అడ్డుకున్నారు. వాహనాల నుంచి దిగిన నేతలు కాలినడకను ముందుకు కదిలారు. కానీ.. కలవపాముల దగ్గర మరోసారి పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బీజేపీ నేతలు దాదాపు మూడు కిలోమీటర్ల మేర పోలీసు వలయాలను ఛేదించుకుని నడిచారు. అదనపు బలగాలతో పోలీసులు.. కలవపాముల దగ్గర వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలో శాంతిభద్రతలను కారణంగా చూపుతూ పోలీసులు అడ్డుకోవడంపై మండిపడుతున్నారు.