కాశీలోని జ్ఞాన్ వాపి మసీదుపై దేశవ్యాప్తంగా భారీ చర్చ నడుస్తోంది. అసలు మసీదు ప్రాంగణంలో ఏముంది..? అక్కడ హిందూ ఆలయ ఆనవాళ్లు ఉన్నాయా..? మసీదును నిర్మించడానికి ఆలయాన్ని ధ్వంసం చేశారా..? లేదంటే ఆలయం ధ్వంసం చేసిన చోట మసీదు కట్టారా..? అసలు మసీదు ఉన్నచోట ఒకప్పుడు కాశీ విశ్వనాథుడి ఆలయం ఉండేదా..? బాబ్రీ మసీదు తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు అంత పెద్ద వివాదం ఇదే అన్నట్టు పరిస్థితి మారింది. ఈ క్రమంలో మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసిన మాజీ అడ్వకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా సిద్దం చేసిన నివేదికలో కీలక విషయాలు బయటకు వచ్చాయి.
జ్ఞాన్ వాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వేకు ఇటీవల వారణాసి సివిల్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వేలో హిందువుల నమ్మకాలను బలపరిచే కీలక ఆధారాలు బయటపడినట్లు తెలుస్తోంది. మసీదులో హిందూ దేవతలకు సంబంధించిన దేవతా శిల్పాలు, ఇతర నిర్మాణాలు కనిపించినట్లు అడ్వకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా సమర్పించిన నివేదిక వెల్లడించింది. మే 6, 7 తేదీల్లో జరిగిన వీడియోగ్రఫీ సర్వే వివరాలను అజయ్ కుమార్ మిశ్రా కోర్టుకు సమర్పించారు.
దీని ప్రకారం జ్ఞాన్ వాపికి మసీదులోకి అడుగుపెట్టిన సర్వే బృందానికి పురాతన ఆలయ శిథిలాలు కనిపించినట్లు నివేదిక వెల్లడించింది. అందులో దేవతా విగ్రహాలు, రాతి శిల్పాలతో పాటు, కమలం నమూనా కనిపించినట్లు చెప్పింది. అలాగే రాతితో చేయబడిన శేష నాగు శిల్పం, సింధూరి గుర్తులతో నాలుగు విగ్రహాలు గుర్తించినట్లు వివరించింది. అలాగే హిందువుల దేవతారాధనలో అతి ముఖ్యమైన దీపారాదనకు సంబంధించిన గుర్తులు సైతం జ్ఞానవాపి మసీదులో కనుగొన్నట్లు అజయ్ మిశ్రా సమర్పించిన నివేదిక తెలిపింది. వీటితో పాటు మసీదు వెనక పడమటి గోడపై కళాత్మక నమూనాలను, రాతి పలకలు కనిపించాయని కోర్టుకు చెప్పింది.
అటు మే 14, 15, 16 తేదీల్లో మసీదులో జరిగిన సర్వే వివరాలను కూడా రెండో నివేదికగా.. స్పెషల్ కోర్టు కమిషనర్ విశాల్ సింగ్ వారణాసి కోర్టుకు సమర్పించారు. ప్రార్థన మందిరంలో తీసిన 1500 వందల ఫోటోలు, 10 గంటల నిడివి గల సర్వే వీడియోను కోర్టుకు అందజేశారు. వారణాసి సివిల్ జడ్జి జస్టిస్ రవి కుమార్ దివాకర్ ఈ నివేదికను స్వీకరించారు.
గత సోమవారమే మసీదులో శివలింగాన్ని గుర్తించినట్లు విస్తృతంగా ప్రచారం జరగగా, తాజాగా మరిన్ని విగ్రహాలు మసీదులో ఉన్నట్లు వార్తలు రావడం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందని… హిందూ సంఘాలు చెబుతున్నాయి. అంతకుముందు
జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు నిత్యం పూజలు చేసుకునేందుకు, అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం జ్ఞాన్ వాపి మసీదు వ్యవహారం సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
ఈ క్రమంలో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగ బయటపడిన ప్రాంతాన్ని సరంక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 17న ఆదేశించింది. అదే సమయంలో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ నర్సింహలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇక వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పులో రెండు అంశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.