ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం రసాభాసాగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభిమానులకు సరైన అవగాహన కల్పించడకపోవడం వల్లనే ఇంత రచ్చ జరిగింది. ఇవాళ మరోసారి జింఖానా గ్రౌండ్స్ క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే స్టేడియానికి చేరుకుంటున్న అభిమానులను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించేస్తున్నారు. జింఖానా గ్రౌండ్ లో ప్రవేశ ద్వారాన్ని మూసేశారు పోలీసులు. ఇక్కడ టికెట్లు అమ్మడం లేదని దయచేసి ఫ్యాన్స్ సహకరించాలని పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో టికెట్లు ఇవ్వాలని హెచ్ సీఏ నిర్ణయించింది. ఆఫ్ లైన్ టికెట్ల కోసమంటూ గ్రౌండ్ వైపు ఎవరూ రావొద్దని పోలీసులు కోరుతున్నారు. గురువారం తొక్కిసలాట, లాఠీఛార్జ్, ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే క్యూలైన్ లో నిల్చోవాలని పోలీసులు సూచించారు. అలాగే ఆన్ లైన్ బుకిగ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుందని, ఇతర వ్యక్తులెవరైనా గ్రౌండ్ లోకి ప్రవేశించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కాగా హెచ్ సీఏ తీరుతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ సీఏని ఆగమాగం చేసి, పాలనలోనూ రిమార్కులు తెచ్చున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో భాగంగా, మూడో టీ20 హైదరాబాద్‌లో జరగనుంది. అయితే, హెచ్‌సీఏ మాత్రం తన తీరుతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇవే మ్యాచ్‌లు దేశంలో మరో రెండు చోట్ల జరిగాయి. కానీ అక్కడా ఆయా క్రికెట్ అసోసియేషన్లు టికెట్లను అమ్మాయి. అక్కడెలాంటి గొడవలు జరగలేదు. ఇక్కడ మాత్రం ఓ లెవల్‌లో రచ్చ జరిగింది.
హెచ్ సీఏ తీరుపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జింఖానా గ్రౌండ్స్ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. హెచ్ సీఏ ప్రెసిడెంట్ వెంటనే రాజీనామా చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా మారేందుకు హెచ్ సీఏ కారణమంటూ ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా హెచ్ సీఏ పై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. టికెట్ల విక్రయ విషయంలో దారుణంగా విఫలమైన హెచ్ సీఏపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ లతో అజారుద్దీన్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. డిజిటల్ యుగంలో కూడా టికెట్లను ఆఫ్ లైన్ లో అమ్ముతూ ఇంత మంది గాయాలపాలయ్యేలా చేయడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.