ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి సర్వర్ హ్యాకర్ల బారిన పడి ‘విలవిలలాడుతోంది’. వరుసగా ఆరో రోజైన సోమవారం కూడా సర్వర్ డౌన్ కావడంతో డాక్టర్లు, రోగులు, వారి బంధువులు తదితరుల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉంది. ఈ సర్వర్ లో మాజీ ప్రధానులు, మంత్రులు, బ్యూరోక్రాట్లు, జడ్జీలు.. ఇలా అనేకమంది డేటా స్టోరయి ఉంది. పైగా సుమారు 3 నుంచి 4 కోట్ల మంది రోగుల డేటా ఇందులో ఉన్నట్టు కనుగొన్నారు.
ఈ సర్వర్ పని చేయకపోవడంతో ఎమర్జెన్సీ, ఔట్ పేషంట్, లేబొరేటరీ విభాగాల సర్వీసులను సిబ్బందే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. హ్యాకర్లు క్రిప్టో కరెన్సీలో రూ. 200 కోట్లు డిమాండ్ చేసినట్టు ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ సైబర్ నేరంపై ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ, రెస్పాన్స్ టీమ్, ఢిల్లీ పోలీసులు , హోమ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్, అండ్ స్ట్రాటెజిక్ ఆపరేషన్స్ యూనిట్ కూడా ఈ నెల 25 న కేసు దాఖలు చేసింది. ఎయిమ్స్ సర్వర్ ను డౌన్ చేసి సర్వీసులకు భంగం కలిగించడం ద్వారా హ్యాకర్లు సైబర్ ఉగ్రవాదానికి తెర తీశారని ఆరోపించింది. దర్యాప్తు సంస్థల సిఫారసుల మేరకు ఆసుపత్రిలోని కంప్యూటర్లపై ఇంటర్నెట్ సర్వీసులను బ్లాక్ చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
అయితే ఎన్ ఐ సి ఈ-హాస్పిటల్ డేటాబేస్ ని పునరుద్దరించినట్టు తెలుస్తోంది. సుమారు 5 వేల కంప్యూటర్లలో దాదాపు 1200 కంప్యూటర్లను అప్పుడే శానిటైజ్ చేశారు కూడా. ఇక్కడి 50 సర్వర్లకు గాను 20 సర్వర్లను స్కాన్ చేస్తున్నారు. ఇది మరో అయిదారు రోజుల పాటు కొనసాగవచ్చునని తెలిసింది. ఎయిమ్స్ చరిత్రలో ఇన్ని రోజులు సర్వర్ డౌన్ కావడం బహుశా ఇదే మొదటి సారని భావిస్తున్నారు.