పశ్చిమ బెంగాల్ లోని అధికార పార్టీ టీఎంసీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ అయింది. టీఎంసీ అధికారిక ట్విట్టర్ ఖాతా పేరును హ్యాకర్లు మార్చి వేశారు. టీఎంసీ పేరుకు బదులుగా యుగా ల్యాబ్స్ అంటూ ఖాతా పేరును ఛేంజ్ చేశారు. దీంతో పాటు పార్టీ లోగోను కూడా మార్చారు.
పార్టీ గుర్తైన రెండు ఆకుల చిహ్నం బదులుగా వైఎల్ అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉన్న లోగోను అప్ లోడ్ చేశారు. కానీ ఖాతా పేరు కింద మాత్రం ఏఐటీసీ (ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ) పేరును మాత్రం అలాగే ఉంచారు. అయితే హ్యాకర్లు ఎలాంటి కొత్త పోస్టులు పెట్టకపోవడం గమనార్హం.
కానీ ఎన్ఎఫ్‌టీలకు సంబంధించి కొన్ని పోస్టులకు మాత్రం హ్యాకర్లు కామెంట్స్ చేశారు. హ్యాకింగ్ విషయం తెలుసుకున్న పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. వెంటనే విషయంపై ట్విట్టర్ కు ఫిర్యాదు చేశారు. త్వరగా సమస్య పరిష్కరించాలని ట్విట్టర్ ను కోరారు.
తమ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా గురైందని ఆ పార్టీ ఎంపీ డరేక్ ఒబ్రేయిన్ తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు ట్విట్టర్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తాము ఎప్పటికప్పుడు ట్విట్టర్‌తో కాంటాక్ట్ లో ఉన్నామని ఆయన వెల్లడించారు.