అదానీ ఎపిసోడ్ నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా కేంద్రంగా పని చేస్తున్న దిగ్గజ విశ్లేషణ సంస్థ ఎస్ అండ్ పీ మరో బాంబు పేల్చింది. భారతీయ కుబేరుడు, వేదాంతా అధిపతి అనిల్ అగర్వాల్ కూడా అప్పుల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని చెప్పింది. ఆయన కూడా ఓ చిన్న పాటి తుఫానును సృష్టించే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది.
వేదాంత కంపెనీ ప్రస్తుతం అప్పుల ఊబిలో ఉంది. వచ్చే జనవరిలో 100 కోట్ల డాలర్ల బాండ్లకు గడువు తీరనుంది. ఇప్పటికే సంస్థ తనకున్న రుణాలను క్రమక్రమంగా ఓ ప్రణాళిక ప్రకారం తగ్గించుకుంటూ వస్తోంది. గడిచిన 11 నెలల్లో కంపెనీ తన నికర అప్పులను 2 బిలియన్ డాలర్లను తగ్గించుకుంది. ప్రస్తుతతం కంపెనీ 7.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.64,000 కోట్ల)కు చేరుకుంది.
ఇప్పట్లో ఈ రుణాల చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇంక్ వెల్లడించింది. కానీ మరోవైపు ఈ ఏడాది సెప్టెంబరు నుంచి 2024 జనవరి వరకు తీర్చాల్సిన రుణ, బాండ్ల కోసం ఆయన సుమారు రూ.12,450 కోట్ల నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదరువుతున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇంక్ పేర్కొంది. రాబోయే కొద్ది వారాల్లో ఆయన వాటిని చెల్లించడంలో విఫలమైతే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పింది. ఇప్పటికే ‘బి-’ క్రెడిట్ రేటింగ్‌లో ఉన్న బాండ్లు ఈ కారణంగా మరింత ఒత్తిళ్లను ఎదుర్కొంటాయని హెచ్చరికలు చేసింది.
అదానీతో పోలిస్తే వేదాంత అప్పులు చాలా తక్కువ అయినప్పటికీ బాండ్ల రేటింగ్ మరీ తక్కువగా ఉండడమే వేదాంతకు ఆందోళన కలిగిస్తోందని వివరించింది. ఇక ఈ సంస్థకు హిందుస్థాన్ జింక్‌లో సుమారు రూ.16,600 కోట్ల నగదు నిల్వలున్నాయి. ప్రతి త్రైమాసికంలో ఈ కంపెనీ 300-600 మి. డాలర్ల ఎబిటాను అందిస్తోంది.
ఈ కంపెనీలో వేదాంతా లిమిటెడ్‌కు 65 శాతం వాటా ఉంది. ఈ క్రమంలో జనవరిలో టీహెచ్‌ఎల్ జింక్ మారిషస్ వాటాను, హిందుస్థాన్ జింక్‌కు విక్రయించాలన్న నిర్ణయానికి వేదాంత వచ్చింది. దీని ద్వారా 3 బిలియన్ డాలర్ల రుణాలను తగ్గించుకుందామని వేదాంత భావించింది. కానీ దీనికి కేంద్రం నో చెప్పింది. ఒక వేళ తమ మాట కాదని ముందకు వెళితే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు చేసింది.
ప్రస్తుతం అనిల్ అగర్వాల్ ముందు రెండు సమస్యలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి హిందుస్థాన్ జింక్ వద్ద ఉన్న నగదు నిల్వలను వినియోగించుకోవాలి. లేదంటే కంపెనీ రుణ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే అప్పులు తీర్చడానికి మరింత అప్పులు చేయాల్సి వస్తుంది. ఇక అటు అమెరికా లాంటి దేశాల్లో తక్కువ వడ్డీకి అప్పులు పుట్టడం లేదని తెలుస్తోంది.
దేశీయంగా గుజరాత్‌లో, ఫాక్స్‌కాన్‌తో కలిసి అనిల్ అగర్వాల్ 19 బిలియన్ డాలర్లతో సెమీకండక్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు మార్చారు. దీంతో వేదాంతపై ప్రతిపక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్తుల విక్రయానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే అది సెమీ కండక్టర్ ఫ్యాకర్టీపై పడే అవకాశం ఉందని తెలుస్తోంది.