హాఫీజ్ పేట భూవివాదం పాతదే అయినా సీఎం కేసీఆర్ బంధువులు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబాల మధ్య మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం బంధువులను కిడ్నాప్ చేశారంటూ కేసు దాఖలు కాగా… ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసులు కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలో చేధించామని తెలిపారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పిన వివరాల ప్రకారం… ఈ కిడ్నాప్ కేసులో ఏ1 ఏవీ సుబ్బారెడ్డి కాగా, ఏ2 భూమా అఖిలప్రియ, ఏ3 భార్గవ్ రామ్. అయితే… ఏవీ సుబ్బారెడ్డికి, భూమా అఖిలప్రియ మధ్య సత్సంబంధాలు లేవని… వీరిద్దరు కలిసి కిడ్నాప్ ప్లాన్ ఎలా చేస్తారన్నది ముందు నుండి చర్చే. ఇదే అంశాన్ని ఏవీ సుబ్బారెడ్డి కూడా మీడియాతో ప్రస్తావించారు. తనకు సంబంధమే లేదన్నారు. ఇంతలో పోలీసులు ఎంటరై అరెస్ట్ చేశారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని పంపించేశారు.
కానీ అప్పటికే ఏ2 భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసి… జైలుకు పంపారు. ఎఫ్.ఐ.ఆర్ ప్రకారం ఏ2నే అరెస్ట్ చేసినప్పుడు అంతకన్నా తీవ్ర నేరస్థుడిగా ఆరోపిస్తున్న ఏ1ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏ1కు నోటీసులతోనే సరిపెట్టారు. దీంతో సీఎం బంధువులుగా ఏదైనా చక్రం తిప్పారా…? స‌్వయంగా సీపీ వెల్లడించిన విషయాల్లో ఆతృతగా మీడియాకు వివరాలు వెల్లడిస్తారా…? భూమా అఖిలప్రియ అరెస్ట్ తర్వాత తెర వెనుక ఎదైనా జరిగి ఉంటుందా….? ఏవీ సుబ్బారెడ్డి-భూమా అఖిలప్రియ మధ్య ఉన్న వైరం పోలీసులకు తెలియకుండా ఉంటుందా…? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే, అప్పటికప్పుడు ఉన్న సమాచారంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినా… చార్జ్ షీట్ లో కరెక్షన్స్ చేస్తూ ఏవీ సుబ్బారెడ్డికి సంబంధం లేదని కానీ, లేదంటే ఏ1 కాదని చెప్పే అవకాశం ఉంటుందని… ఫస్ట్ ఇన్మర్మేషన్ ఆధారంగానే ఎఫ్.ఐ.ఆర్ నమోదవుతుందని పోలీస్ వర్గాలంటున్నాయి.