శనివారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా గంట పాటు గులకరాళ్ల సైజులో వడగండ్లు పడి వరి పంటలు, తోటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు వీచి పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. పొట్ట దశలో ఉన్న వరి పంటలు దెబ్బతిన్నాయి.
ఇక జిల్లా వారిగా పంటల నష్టం విషయానికొస్తే.. ములుగు జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం, గణపురం మండల కేంద్రంలో వడగండ్ల వానకు వరి పంట పూర్తిగా దెబ్బ తిన్నది. వరంగల్ జిల్లాలో గత రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఖానాపురం, నెక్కొండ నర్సంపేట నల్లబెల్లి దుగ్గొండి, చెన్నారావు పేట మండలాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
అదే విధంగా మొక్కజొన్నతో పాటు వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. మహబూబాబాద్ డివిజన్లోని గంగారం,కొత్తగూడ, గూడూరు మండలాల్లో మొక్కజొన్నతో పాటు మిరప, వరిచెల్లు దెబ్బతిన్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక,ఇళ్లందకుంట మండలాల్లో శనివారం రాత్రి వడగండ్ల వాన కురియడంతో మిర్చిపంట, మొక్క జొన్న, వరి పంటలు మొత్తం నేలకొరిగాయి.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చే టైమ్ లో వడగండ్ల వర్షంతో భారీగా నష్టం వచ్చిందని అన్నదాతలు ఉసూరుమంటున్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో చేతికొచ్చిన పంట నేలపాలైంది. సుమారు 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, శనగ, ఆలు, మామిడి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లాలో పలు చోట్ల మొక్కజొన్న పంట నెలకొరిగాయి. సిద్ధిపేటలో పొద్దుతిరుగుడు పంటకి తీవ్ర నష్టం వాటిల్లింది.
జగిత్యాలలో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న నేల వాలింది. కల్లాల్లో పసుపు తడిసి ముద్దైంది. రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 4000 ఎకరాల్లో నేల వాలిన మొక్కజొన్న, కల్లాల్లో తడిసిన సుమారు 5 క్వింటాల్ల పసుపుకొమ్ములను అంచనా వేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు. నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోను అకాల వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లే మిగిల్చాయి.