హెచ్ఎల్‌ఎఫ్టీ-42 విమానంపై ఉన్న హనుమాన్ బొమ్మను తొలగించారు. ఈ మేరకు హెచ్ఎల్ ఎఫ్టీ-42 తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఓ ప్రకటన చేసింది. బెంగుళూరులో జరుగుతున్న ఏరో షోలో ఆ విమానాన్ని నిన్న ప్రదర్శన కోసం ఉంచారు.
సంస్థలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ఎండీ సీబీ అనంత కృష్ణన్ వెల్లడించారు. హనుమంతుని బొమ్మను ఇప్పుడు పెట్టడం సరికాదని తాము భావించినట్టు ఆయన పేర్కొన్నారు. అందుకే దాన్ని తొలగించాలని నిర్ణయించామన్నారు.
బెంగళూరులో నిర్వహించిన ఏరో ఇండియా 2023 మొదటి రోజున, హెచ్ఏఎల్ తన సూపర్‌సోనిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ హెచ్ఎల్ ఎఫ్టీ-42 పూర్తి స్థాయి మోడల్‌ను ప్రదర్శించింది. తోక భాగంపై హనుమంతుడి చిత్రంతో ప్రదర్శనలో ఆ విమానం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
హెచ్ఏఎల్ మారుత్ తొలి స్వదేశీ విమానం. దీన్ని మరింత ఆధునీకరించి హెచ్ఎల్ఎప్టీ-42 విమానాన్ని తయారు చేశారు. మారుతికి మరో పేరు వాయువు. దాన్నే పవన్ అని కూడా పిలుస్తారని, పవన పుత్రుడే హనుమంతుడని అందుకే ఆయన ఫోటోను ఆ విమానం ఫిన్ భాగంలో పెట్టినట్లు గ్రూపు కెప్టెన్ హెచ్‌వీ థాకూర్ తెలిపారు.