ఈ శతాబ్దంలోనే అతి పెద్ద సమ్మెతో బ్రిటన్ ప్రభుత్వం అట్టుడికిపోతోంది. రిషి సునాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు రోడ్లెక్కారు. తాజాగా తమకు జీతాలు పెంచాలంటూ కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పని పరిస్థితులు మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న వారిలో అధికంగా సివిల్ సర్వెంట్లు, రైలు డ్రైవర్లు, ఉపాధ్యాయులు ఉన్నారు. సివిల్ సర్వెంట్ల, ఉపాధ్యాయుల జీతాలు పెంచితే అది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని రిషి సునాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతున్నది.
సుమారు 5లక్షల మందికి పైగా కార్మికులు బ్రిటన్ వీధుల్లోకి వచ్చారు. విద్య, రవాణా, పౌరసేవలు, తదితర రంగాల కార్మికులు తమ విధులను బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. దీంతో బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు మూతపడ్డాయి. రైలు సర్వీసులు ఆగిపోయాయి.
సివిల్ సర్వెంట్ల, ప్రభుత్వాధికారుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. 2011 నవంబర్ 30న జరిగిన పెన్షనర్ల సమ్మె తర్వాత ఇంత పెద్దఎత్తున సమ్మె జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు.